సంతోష్ అలా సుకన్య గురించి ఆలోచిస్తూ ఫోన్ చేస్తూ కంగారు పడుతూ వుండగా ముందు ట్రాఫిక్ మన్ను తిన్న పాము లాగా మెల్లగా కదలసాగింది. సంతోష్ తొందరగా ఇంటికి వెళ్ళటానికి దొరికిన ఏ కొంచెం ఖాళీ వదలట్లేదు. అతనికి టెన్షన్ వల్ల బాగా చెమటలు పట్టేసాయి. ఇంకా తట్టుకోలేక హెల్మెట్ తీసి బండి నడుపుతున్నాడు.
అతను అలా కష్టపడుతూ మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే డొంక రోడ్డు లోకి వచ్చేసాడు. అప్పటికే గంట అయ్యింది సుకన్య నించి కాల్ వచ్చి. ఎప్పుడు ఆ రోడ్ లో 40 దాటని సంతోష్ 90 లో వెళ్తున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఇంటివైపు చూస్తూ బండి నడుపుతున్నాడు.
***********************************************************************
భర్త ఇంటికి రాలేదు ఇంట్లో కరెంటు పోయింది. ఎంత వెదికిన కొవ్వొత్తులు కనిపించలేదు. ఇంకా చీకటిలో వుండటం ఎందుకు అని కొంచెం దూరం లో ఉన్న పిన్నిగారి ఇంటికి వెళ్లి కొవ్వొత్తి తెచ్చుకుందాం అని సుకన్య అనుకుంది. కానీ తనతో పాటుగా ఫోను తీసుకెళ్లటం మర్చిపోయింది. పిన్ని గారి ఇంటికి వెళ్లి ఒక పది నిముషాలలో
వచ్చేద్దాం అనుకుంది సుకన్య కానీ పిన్నిగారు కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేసారు.
"సంతోష్ వచ్చేసి ఉంటాడు. ఇంకా నేను వెళ్ళాక నామీద వీరంగం వేస్తాడు." అని మనసులో అనుకుంటూ "అవునా పిన్నిగారు..అలా జరిగిందా?" అని ఏమి చెప్తోందో వినకుండా ఎటో ఆలోచిస్తోంది సుకన్య. నిన్ననే ఇద్దరికీ గొడవ అయ్యింది. ఈ రోజు అతనికి నచ్చినవి అన్ని చేసిపెట్టింది. అతనికి బాగా ఇష్టమయిన చీర కట్టుకొని ఎదురు చూస్తోంది. అదే చెప్దాం అని ఒక గంట ముందు ఫోన్ చేసింది కానీ సంతోష్ ఎత్తలేదు. "అయితే బయలదేరిపోయారు " అని కంగారుగా మిగతా సింగారం చేసుకుంటుండగా కరంటు పోయింది ఇంకా కొవ్వొత్తి కోసం వచ్చి పిన్నిగారికి దొరికిపోయింది.
"బాబా సాయిబాబా....బాబా సాయిబాబా...నీవు మావలె మనిషివని..." అంటూ పిన్ని గారి ఫోన్ మోగుతోంది. "ఆ చెప్పండి...అవునా సరే అయితే" అని పెట్టేసింది పిన్నిగారు. "మీ బాబాయ్ ఫోన్ అమ్మాయి రావటానికి ఇంకో
20 నిముషాలు పడతాయి అంట. ఇంకా అన్నం వండలేదు" అని ఏదో చెప్పబోయింది. "సరే పిన్ని గారు అయితే ఇంకా నేను వెళ్తాను. ఆయన కూడా వస్తూ వుంటారు. ఇంట్లో పని వుంది" అని బయల్దేరింది సుకన్య.
సంతోష్ ఇంటికి వచ్చేసి ఉంటాడు పాపం గేటు బయట కూర్చుని ఉంటాడు అని కంగారుగా నడుస్తోంది సుకన్య. ఆ కంగారులో మలుపు కి అటు వైపు వస్తున్న బండిని చూడలేదు. కొంచెం దగ్గరగా వచ్చాక చూసింది కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది ....
*****************************************************
"పాపం పెళ్ళాం ఫోన్ ఎత్తలేదు అని కంగారు పడి స్పీడ్ గా వస్తూ చీకట్లో ఆ పిల్లనే గుద్దేసాడు. పక్కన కొండ రాళ్ళకు తల తగలటం వల్ల ఇద్దరు చచ్చిపోయారు" అంటూ చుట్టూ గుమ్మిగూడున్న జనాలలో ఒకడు అనటం గాలిలోకి తన భార్య తో పాటు వెళ్తున్న సంతోష్ ఆత్మ విని కన్నీరు కారుస్తోంది, పక్కన ఉన్న సుకన్య ఆత్మ ఇంకా ఆ షాక్ నించి తెరుకోనట్టు సూటిగా సంతోష్ నిర్జీవ దేహాన్ని చూస్తూ వుంది. మెల్లగా రెండు ఆత్మలు అలా మేఘాలలో కలిసి పోయాయి.