Showing posts with label andhra pradesh. Show all posts
Showing posts with label andhra pradesh. Show all posts

2019-10-21

నా ఆలోచన: వార్తలు

లీలగా జరిగినది లాగి చెప్తాను
గోలలో గుర్తున్నది గోరింతలు చేసి చెప్తాను 
నేరుగా చూసింది నరికి నాకు నచ్చింది చెప్తాను 
బేజారు అయ్యేదాకా బెంబేలు  ఎత్తేదాకా అదే అదే చెప్తాను 

అన్నట్టు ఉన్నది ఇప్పటి ఛానెళ్ల పరిస్థితి 


dengue  జ్వరాలు వచ్చి పిల్లలు పెద్దలు న్యాయమూర్తులు చనిపోతుంటే ఇదేంటి ప్రభుత్వం ఏమి చేస్తోంది అని నిలతీసే ధైర్యం లేని పత్రిక లలిత జెవెల్లెర్స్  దొంగ రెక్కీ ఎలా చేసాడు అన్నది ముఖ్యం అనుకున్నది. ఆ వివరాలు ఎందుకు ఎవరికీ ఉపయోగపడతాయి అని చూపిస్తున్నారు?


ఈనాడు 21 Oct  2019  3:17 PM





















బ్రతుకు భయం గుండె ఆగిన ఒక కార్మికుడి కష్టం కన్నా ఒక నటీమణి నిర్మాత మీద అలిగిందా లేదా అన్నది ముఖ్యమనుకున్న  మరో పత్రిక 


సాక్షి 21 Oct  2019 3:22 PM 
ఆంధ్రజ్యోతి 21 oct 2019 3:37 PM 





















నెల క్రితం బోటు ఎందుకు మునిగింది దాని వెనక శివుడున్నాడా లేదా అన్నది జనాలని ఇబ్బంది పెడుతున్న సమ్మె కన్నా ముఖ్యమన్న పత్రిక ఇంకొకటి


అసలు ఒక్కటన్నా నిజంగా జనాల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తోందా? రోజు ఉద్యోగం కి వెళ్లే వాడికి బస్సులు  ఆటోలు తిరగటం కావాలి కానీ గతాలు దొంగతనాలు ఎందుకు చెప్పండి 

పత్రిక విలువల మీద నేను పెద్దగా మాట్లాడే అర్హత నాకు లేదు కానీ ఒక పత్రిక చదువుతున్న పాఠకుడిగా నా రోజు నాకు కావాల్సిన అంశాలతో మొదలవ్వాలి అని ఉంటుందిగా. కాళేశ్వరం లింక్ చేస్తున్నారు హైదరాబాద్ లో మూడు రోజులు నీళ్లు రావు అని చెప్పిన పత్రికలూ ఆ తర్వాత నాలుగవ రోజు కూడా నీరు రాలేదు కొన్ని ప్రాంతాలకి అన్నది ఎంతవరకు జనాలలోకి తీసుకెళ్లింది. 

రాష్ట్రమంతా డెంగీ వ్యాధి సోకి జనాలు చనిపోతుంటే దానిమీద ముందు పేజీ లో ప్రశ్నించటం ఆపి ఒక్క హుజుర్ నగర్ ఎన్నికకి ప్రాముఖ్యత ని ఇవ్వటం సబబా??? ఎప్పుడో వారం క్రితమే మేము డెంగీ గురించి చెప్పం అనచ్చేమో  కానీ చెప్పిన తరువాత  పరిస్థితులు మారాయా? మారకపోతే మార్చే బాధ్యత  నాయకుల మెడలు వంచే భాద్యత మీడియాకి లేదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పత్రికని నమ్మలేని స్థితిలో జనం నమ్మకం గెలుచుకోలేని దయనీయమైన స్థితిలో పత్రికలూ వున్నాయి అని నాకు అనిపిస్తోంది మరి మీకు?


-మీ నేస్తం 

2012-06-29

కవిత: వియోగం

సఖివై చేరావు నా సహవాసాలు మార్చావు


సడిలేని నా బ్రతుకులో అలజడులే రేపావు

జడివానలో గొడుగులా నా కడగళ్ళలో నిలుచావు

కడకు నన్నొదిలి నా ఎదలో గాయం మిగిల్చావు
 

2012-02-14

కధ: విధి - 2

సంతోష్ అలా సుకన్య గురించి ఆలోచిస్తూ ఫోన్ చేస్తూ కంగారు పడుతూ వుండగా ముందు ట్రాఫిక్ మన్ను తిన్న పాము లాగా మెల్లగా కదలసాగింది. సంతోష్ తొందరగా ఇంటికి వెళ్ళటానికి దొరికిన ఏ కొంచెం ఖాళీ వదలట్లేదు. అతనికి  టెన్షన్ వల్ల బాగా చెమటలు పట్టేసాయి. ఇంకా తట్టుకోలేక హెల్మెట్ తీసి బండి నడుపుతున్నాడు.

అతను అలా కష్టపడుతూ మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే డొంక రోడ్డు లోకి వచ్చేసాడు.  అప్పటికే గంట  అయ్యింది సుకన్య నించి కాల్ వచ్చి. ఎప్పుడు ఆ రోడ్ లో 40  దాటని సంతోష్ 90 లో వెళ్తున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఇంటివైపు చూస్తూ బండి నడుపుతున్నాడు.
***********************************************************************

భర్త ఇంటికి రాలేదు ఇంట్లో కరెంటు పోయింది. ఎంత వెదికిన కొవ్వొత్తులు కనిపించలేదు. ఇంకా చీకటిలో వుండటం ఎందుకు అని కొంచెం దూరం లో ఉన్న పిన్నిగారి ఇంటికి వెళ్లి కొవ్వొత్తి తెచ్చుకుందాం అని సుకన్య అనుకుంది. కానీ తనతో పాటుగా ఫోను తీసుకెళ్లటం మర్చిపోయింది. పిన్ని గారి ఇంటికి వెళ్లి ఒక పది నిముషాలలో 
వచ్చేద్దాం అనుకుంది సుకన్య కానీ పిన్నిగారు కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేసారు.

"సంతోష్ వచ్చేసి ఉంటాడు. ఇంకా నేను వెళ్ళాక నామీద వీరంగం వేస్తాడు."  అని మనసులో అనుకుంటూ "అవునా పిన్నిగారు..అలా జరిగిందా?" అని ఏమి చెప్తోందో వినకుండా ఎటో ఆలోచిస్తోంది సుకన్య. నిన్ననే ఇద్దరికీ గొడవ అయ్యింది. ఈ రోజు అతనికి నచ్చినవి అన్ని చేసిపెట్టింది. అతనికి బాగా ఇష్టమయిన చీర కట్టుకొని ఎదురు చూస్తోంది. అదే చెప్దాం అని ఒక గంట ముందు ఫోన్ చేసింది కానీ సంతోష్ ఎత్తలేదు. "అయితే బయలదేరిపోయారు " అని కంగారుగా మిగతా సింగారం చేసుకుంటుండగా కరంటు పోయింది ఇంకా కొవ్వొత్తి కోసం వచ్చి పిన్నిగారికి దొరికిపోయింది.

"బాబా సాయిబాబా....బాబా సాయిబాబా...నీవు మావలె మనిషివని..." అంటూ పిన్ని గారి ఫోన్ మోగుతోంది. "ఆ చెప్పండి...అవునా సరే అయితే" అని పెట్టేసింది పిన్నిగారు. "మీ బాబాయ్ ఫోన్ అమ్మాయి రావటానికి ఇంకో 
20  నిముషాలు పడతాయి అంట. ఇంకా అన్నం వండలేదు" అని ఏదో చెప్పబోయింది. "సరే పిన్ని గారు అయితే ఇంకా నేను వెళ్తాను. ఆయన కూడా వస్తూ వుంటారు. ఇంట్లో పని వుంది" అని బయల్దేరింది సుకన్య.
సంతోష్ ఇంటికి వచ్చేసి ఉంటాడు పాపం గేటు బయట కూర్చుని ఉంటాడు  అని కంగారుగా నడుస్తోంది సుకన్య. ఆ కంగారులో మలుపు కి అటు వైపు వస్తున్న బండిని చూడలేదు. కొంచెం దగ్గరగా వచ్చాక చూసింది కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది .... 

*****************************************************
"పాపం పెళ్ళాం ఫోన్ ఎత్తలేదు అని కంగారు పడి స్పీడ్ గా వస్తూ చీకట్లో ఆ పిల్లనే గుద్దేసాడు. పక్కన కొండ రాళ్ళకు తల తగలటం వల్ల ఇద్దరు చచ్చిపోయారు" అంటూ చుట్టూ గుమ్మిగూడున్న జనాలలో ఒకడు అనటం గాలిలోకి తన భార్య తో పాటు వెళ్తున్న సంతోష్ ఆత్మ విని కన్నీరు కారుస్తోంది, పక్కన ఉన్న సుకన్య ఆత్మ ఇంకా ఆ షాక్ నించి తెరుకోనట్టు సూటిగా సంతోష్ నిర్జీవ దేహాన్ని చూస్తూ వుంది. మెల్లగా రెండు ఆత్మలు అలా మేఘాలలో కలిసి పోయాయి.


(అయిపొయింది)

2012-02-09

కధ: విధి - 1

"నేను నువ్వంటూ వేరే వున్నా నాకివేళ నాలో నువ్వునట్టుగా ....." అంటూ మోగుతోంది సంతోష్ ఫోన్. ఆ కాల్ తన భార్య సుకన్యనించి వచ్చింది.తనకొక్కదానికే ఆ టోన్ వస్తుంది. ఇంకో
10  కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఇల్లు వచ్చేస్తుంది. బండి వేగం ఇంకా కొంచెం పెంచాడు సంతోష్.

మామూలుగా వేరే ఎవరైనా కాల్ చేస్తే డ్రైవ్ చేస్తూ మాట్లాడతాడు కాని సుకన్య అలా మాట్లాడితే తిడుతుంది అందుకే తన కాల్ పట్టించుకోకుండా వదిలేసాడు. ఇంకో పది నిముషాలలో ఎలాగన్నా ఇంటికి వెళ్లిపోవాలి అనుకుంటూ వేగం పెంచుతూ పోతున్నాడు. ఇంతలో దూరంగా ట్రాఫిక్ జాం కనిపించింది. తను ఇంటికి త్వరగా వెళ్ళాలి అన్న ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. ఇంకో గంటకి వెళ్తే గొప్ప అనుకుంటూ ఆగివున్న బస్సువెనక తన పల్సర్ ఆపి ఇంటికి కాల్ చేసాడు.అటు నించి సమాదానం లేదు. ఏదో పని లో వుంది వుంటుంది అని మళ్లీ చేసాడు మళ్లీ సమాధానం లేదు. సరేలే ఒక 10  నిముషాలు ఆగి చేద్దాం అని బండి మీద అలా కూర్చుండి పోయాడు. సెల్లులో సమయం చేస్తే అప్పటికే రాత్రి 10  అయ్యింది.

బండి మీద చాలా అసహనం గా వున్నాడు సంతోష్ సుకన్య కి ఇప్పటికి 10  సార్లు కాల్ చేసాడు కాని ఆమె నించి జవాబు లేదు. మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఎంత మంది చెప్పిన వినకుండా ఈ నిర్మానుష్యమైన చోట ఇల్లు
తీసుకున్నందుకు తనని తానూ బాగా  నిందించుకుంటూ అసలు ట్రాఫిక్ ఎందుకు ఆగింది చూద్దాం అని ముందుకు వెళ్లి చూసాడు. చాలా దూరం నించి వాహనాలు ఆగి వున్నాయి. ఈ లోపు అటు వైపు నించి ఒక అంబులన్సు సైరను వేసుకుంటూ వెళ్తోంది. ఆ అంబులన్సు వెనకపడి వచ్చిన కొన్ని వాహనాలలో ఒకటి సంతోష్ ఉన్న చోట ఆగిపోయింది.
"బాస్, ఏమైంది ముందర??" అడిగాడు సంతోష్
"ఎవరో ఒక లేడి ని బస్సు గుద్దింది అంట...ఫోన్ మాట్లాడుతూ రోడ్ చూడకుండా రోడ్ దాటబోయింది బస్సు గుద్దేసింది..బాగా దెబ్బలు తగిలాయి.. ఈ బస్సు వెనక వున్నా లారీ సడన్ బ్రేకు వేసే సరికి బోల్తా పడింది...రోడ్ అంతా బ్లాక్ అయ్యింది...ఇంకా మీరు వెళ్ళటానికి ఇంకో గంటన్నా పడుతుంది" అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అతను.

"లేడి" "ఫోను" అనే సరికి సంతోష్ భయం ఇంకా పెరిగిపోయింది. ఇంకో సారి  సుకన్య కి కాల్ చేసాడు సమాధానం లేదు. చుట్టూ పక్కలకి ఫోన్ చేద్దాం అన్న వీళ్ల ఇంటికి దగ్గరగా  ఇళ్ళు లేవు. అతనికి మనసులో చాలా ఆలోచనలే తిరుగుతున్నాయి. ఒక పక్కన ఏమి జరిగిందో అన్న భయం ఇంకో పక్కన ఏమి జరిగివుండదు లే అన్న ఆశ మెదులుతున్నాయి.

...ముగింపు త్వరలో


2012-01-11

సహాయం కోసం విన్నపం



నా మిత్రుడు నాకు పంపిన ఈ-మెయిల్ ఇక్కడ పొందుపరుస్తున్నాను. పాపం ఆ తండ్రికి సాద్యమైనంత సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను.

Hi All,


A 11 year old kid who is by birth deaf and dumb, has got an oppurtunity to become like us.After some tests the doctors have given hope for the kid and his family, that he would both listen and will be able to speak only if he gets operated.The cost of operation and medicines is 10 lacs and it is on 12th Jan 2012 in Visakhapatnam.

The kids family is very poor and his Dad is a local school teacher. His father was able to arrange 6 lacs and still in need of rest of the amount.

So if we can help the kid and contribute some amount even if its 50 or 100.. it will be very helpful for the kids operation and medication.

Remember  “Small Drops Make A Mighty Ocean".
So even a small contribution by each person will result in a huge amount. Sincere request to come forward and make some contribution towards the kid.

Below is the contact no of the kid's father:-

Father name :- M. BalaKrishna
Contact No:- 9293219768


You can transfer it to my account or to the kids father account. If you transfer to my account i will directly give to kids father. Below are the account details of the kids father and my account details:

Kids Father Bank Account Details:-


Account No:-     31403036008
Name:-             Balakrishna Metta
IFSC Code:-       2716         
Bank :-              State Bank of India
Branch:-            Gajuwaka Branch


My Account Details:-
Account No:-     055801538691
Name:-             Vamsi Krishna Batchu
Branch:-           ICICI Infosys Mysore

Please mention your Employee id in the Transaction remarks.

Please don’t reply all. If possible forward the above mail to your friends who are willing to help.

Thanks in Advance,
Vamsi Krishna Batchu



ఈ వార్త పూర్తిగా దృవీకరించబడినది. మీకు తోచినంత దానం చేసి ఆ తండ్రికి సహకరిస్తారు అని ఆశిస్తూ.

-మీ నేస్తం

2011-08-22

పేరడి:సదా శివ సన్యాసి

ప్రతి బిల్డ్ కి కొత్త బగ్గులు వస్తుంటే కడుపు మండిన ఒక టెస్టర్ పాడుకుంటున్న పాట:

(ఖలేజా లో "సదా శివ సన్యాసి...పాటను గుర్తుతెచ్చుకోండి)

సదా శివ సన్యాసి మా డెవలపర్ సన్నాసి  
వాడి బగ్గులు చూసి పొంగినాయి నా కళ్ళు వాచీ
ఏ బటను క్లిక్కు కాదుగా
డ్రాపు డవును లిస్టే రాదుగా
చూడ చెత్తగా ఉంటాదిరా
వేసేయ్ రా ఊరు వాడా దండోరా !!

ఏ స్టయిలుల ఏ స్క్రిప్టుల పొడ లేదురా 
ఏడు ఏళ్ళ అనుభవం  వుందిరా 
నాలుగు లైన్ల కోడులో నలభై బగ్గులే వచ్చురా
వర్డ్ చించి నువ్వు చెప్పిన వీడి కోడు బాగుపడదురా...
 మేధావిలా  ఓ జ్ఞానిలా ఉంటాడు ఏం లీలా 
నాకు  వీడు నైటుమేరు వీడి పీడా నాకు పొదూ
నన్ను పట్టిన శని వీడు వేరే ప్రాజెక్ట్కి పోనే పోడు  

ఓ మై గాడ్ వాట్ షుడ్ ఐ డు 
ఓ మై గాడ్ వాట్ షుడ్  ఐ డు

2011-07-20

కవిత: అందం

ఒక ప్రియుడు తన ప్రియురాలుని పొగుడుతూ ఇలా అన్నాడట




సుతిమెత్తని నీ పాదాలు తెచ్చెను గజ్జెలకి అందం

సుమధురమైన నీ పలుకులు తెచ్చెను భాషకి అందం

సువర్ణభరితమైన నీ మోము తెచ్చెను అద్దానికి అందం

సుగుణాలభరితమైన నీతో బంధం తెచ్చెను నాకు ఆనందం

2011-06-29

నా ఆలోచనలు: పెళ్లి

"పెళ్లి అంటే నూరేళ్ళ పంట... ముట్టుకుంటే మంట... ఎందుకొచ్చిన తంట" వీటిలో ఏదో ఒకటి పెళ్లి కాని అమ్మాయి కాని అబ్బాయి కాని మనసులో అనుకునేదే. వాళ్ళు అలా అనుకోవటానికి వారి వారి కారణాలు చాలానే ఉంటాయి. ఇలాంటి పెళ్లి మీద నా ఆలోచనలు చెప్పాలి అని ఈ టపా:)


ఏదో సినిమా(తులసి అనుకుంట) లో వెంకటేష్ గుక్కతిప్పకుండా 2 నిముషాలు చెప్తాడు.పెళ్లి గురించి ఏడు నించి ఒకటి దాక అంకెలు వచ్చేటట్టు చెప్తాడు. నేను కూడా పెళ్లి గురించి అంతే క్లుప్తం గా చెప్పాలి అని అనిపించింది, కాని నాకు అంటే పెళ్లి కాకుండా ఇంట్లో వేరే వాళ్ళకి పెళ్లి పనులు చేసిన అనుభవం వున్న వాడికి కలిగే భావం ఏంటంటే పెళ్ళంటే " "ఏడు"(ఏడాది అని చదువుకోండి) కష్టపడి అమ్మాయి లేదా అబ్బాయి ని వెతికి "ఆరు" గంటల పాటు తంతు చేయించి "ఐదు" రకాలుగా(టీ,కాఫీ,నీళ్ళు,అల్పాహారం, భోజనం) అతిధులని సత్కరించి  "నాలుగు" గోడల మధ్యన నాలుగొందల మందిని కోర్చోబెట్టి "మూడు" ముళ్ళు వేయించి "రెండు" కుటుంబాలని కలిపే "ఒక" రోజు" అంతే..

పెళ్లి జనాల కోసం కాని ఆ జంట కోసం కాదు. వాళ్ళ మధ్యన ప్రేమ ఎప్పుడు చిగురిస్తుందో నేను చెప్పలేను కాని పెళ్ళిలో నూటికి డబ్బై శాతం ప్రేమ పుట్టదు అని నా నమ్మకం. పెళ్ళికి ముందే ప్రేమలో పడితే వాళ్ళకి పెళ్లి చాలా ఆనందం గా వుంటుంది. పెళ్లి తర్వాత ప్రేమలో పడితే వాళ్ళకి పెళ్లి అంతే కంగారు,భయం, ఆనందం కలిపి మిక్సి లో వేసి కలిపినట్టు వుంటుంది. ఇష్టం లేని పెళ్లి అయితే నేను చెప్పకర్లేదు. ఇలాగ ఆ జంట భావాలు అక్కడ పరిస్థితిని బట్టి మారుతుంటాయి. కాని జనాలకి మాత్రం పెళ్లి అంటే మంచి ఆటవిడుపు చుట్టాలని కలిసి కబుర్లు చెప్పుకొని..కొందరు గొప్పలు పోవటానికి కొందరు చాడీలు చెప్పటానికి ఇలా రకరకాలు గా వాళ్ళ ఆనందం పొందటానికి ఏర్పరిచే వేదిక.

ఇక పెళ్ళిలో ఇంకో వర్గం జనాలు వుంటారు వాళ్ళే పెళ్లి పనులు చేసేవాళ్ళు. వాళ్ళని గుర్తించటం చాలా తేలిక పెళ్ళిలో అందరికంటే చెమటలు కక్కుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు అంటే వాడు పెళ్లి పనులు చేస్తున్నాడు అని అర్ధం. వాళ్ళకి పెళ్లి ఎలా జరిగింది అంటే చెప్పే సమాధానం ఇంత మంది వచ్చారు(భోజనాల  లెక్క) ఇంత ఖర్చు అయ్యింది. వాడిని పెళ్లి కూతురు చీర రంగు తెలియదు పెళ్లి కొడుకు డ్రెస్సు తెలియదు అసలు తాళి కట్టాడో లేదో కూడా కొన్ని సార్లు తెలియదు.

ఇలా విబిన్నమైన వర్గాల జనాలు ఒక చోట మూగి చేసే తంతే పెళ్లి


ఇట్లు
మీ నేస్తం



  

2011-06-08

నేను మొదటి తరగతి లో చేరే వయసొచ్చిందిరో!!

మొత్తానికి నా జీవితం లో ఇంకో మైలురాయి చేరుకున్నా...నేను ఒకటవ తరగతిలో చేరేందుకు సరిపడా వయసు వచ్చింది నాకు...ఏంటి అర్ధం కాలేదా సరిగ్గా మూడు రోజుల క్రితం నాకు ఈ ఐ.టి రంగం లో ఐదేళ్ళ అనుభవం వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఐ.టి రంగం లో మొదటి తరగతి(టీం లీడ్) చదవచ్చు అన్నమాట. ఒక్క సారి నా ఈ ఐదేళ్ళ ప్రయాణాన్ని నెమరు వేసుకుంటే ఇలా అనిపించింది.

 
ఎన్నో ఆసలు ఎన్నో కలలు మనసు నిండుగా వుండగా ఈ రంగం లో చంటిపాపలగా అడుగు పెట్టాను. అంతకు ముందు నవమాసాలు మాసానికి ఒక పరిక్ష లెక్కన తొమ్మిది పరీక్షలు చేసారు(ఏడవ తరగతి, పడవ తరగతి,ఇంటర్ రెండేళ్ళు, ఇంజనీరింగ్ నాలుగేళ్ళు, కంపెనీ వాళ్ళ పరీక్ష ఒకటి మొత్తం తొమ్మిది)...పుట్టగానే పిల్లలు ఎలా అమాయకం గా వుంటారో నేను కూడా అలాగే అమాయకం గా ఐ.టి రంగం లోకి అడుగుపెట్టాను..నాకు పాకటం,నడవడం(కోడింగు, టెస్టింగు) అన్ని మా కంపని నేర్పించింది.

ప్రతి పుట్టిన రోజుకి కొత్త బట్టలు(హైకు) పెట్టారు. బట్టలతో పాటు నేను ఆ ఏడు చేయాల్సిన పనులు కూడా పెంచారు(ప్రమోషన్). మొదటి రెండేళ్ళు జీవితం లో ఏదో సాధించిన ఆనందం ఆ లెటర్ తీసుకున్నప్పుడు కలిగింది.  ఈ లోపు మనం నడక నేర్చాము (తప్పులు చేయకుండా కోడింగ్) ఆ తర్వాత పరుగులు కూడా నేర్చాము(స్పీడ్ గా కోడింగ్). ఆ పరుగుల మధ్యన పడుతూనే ఉన్నాం అందరు ఎందుకంత కంగారు అని తిడుతూనే వున్నారు. ఆ తర్వాత కాలం ఎలా గడిచిందో గమనించే లోపే ఐదేళ్ళు గడిచిపోయాయి .

ఇదండీ నా ఐదేళ్ళ జీవితం. ఇప్పటి నించి చాలా ఎక్కువ బాధ్యతలు వుంటాయి అని అంతా అంటున్నారు నాకు మాత్రం ఎప్పటిలాగానే పడుతులేస్తూ రోజు చేసే పనే అని అనిపిస్తుంది. ఎలా వుంటుందో ఏంటో చూడాలి మరి...


ఇట్లు,
మీ నేస్తం   

2011-03-24

కధ: చావా??? బ్రతుకా???

కారుమబ్బులు కమ్ముతున్న సమయం..కుమార్ ఆకాశాన్ని పట్టించుకొనే పరిస్థితిలో లేడు. తన ముందిప్పుడు రెండే మెదులుతున్నాయి. ఒకటి తనను ఇంతటివాడిని చేసిన తల్లిదండ్రులు రెండు తను ప్రేమించిన సరోజ. వాళ్ళలో ఎవరిని వదులుకోలేడు కాని ఇద్దరు ఉండే దారి కనపడట్లేదు. చాలా రోజులనించి ఈ సమస్య పరిష్కారం కోసం అలోచించి ఇంకా ఆలోచించలేక ఏ సమాధానం దొరకక తన చావుతో సమస్య పరిష్కరిద్దాము అన్న నిర్ణయానికి వచ్చి దగ్గరలో ఉన్న నిర్జన కొండమీద పురుగుమందు తాగటానికి నిర్ణయించుకున్నాడు.

కొండ మీద కి వెళ్లి కూర్చొని ఒక్క సారి తన వారితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. ముందుగానే కొని తెచ్చుకున్న శీతల పానియము, పురుగుల మందు డబ్బాలు పక్కన పెట్టి ఇంటికి కాల్ చేసాడు. ఫోన్ ఎత్తిన అమ్మతో "హలో అమ్మా" అని ఉబికివస్తున్న బాధని దిగమింగుతూ మాట్లాడుతున్నాడు.

"హలో కుమార్ ఏమైందిరా ఎందుకు అంత బాధ పడుతున్నావ్" కంగారుగా అడిగింది అమ్మ. తను ఏడుస్తున్న విషయం అమ్మకి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూనే ఇంకా ఏడుపు ఆపుకోవటం తనవల్ల కాక పెట్టేసాడు కుమార్.

ఎంత సేపు ఏడిచాడో తెలియదు కళ్ళు తుడుచుకొని మళ్ళి ఇంటికి కాల్ చేద్దాము అని ఫోను తీసాడు. ఈ లోపు ఇంటినించి పదిసార్లు కాల్ వచ్చింది అని తను ఎత్తలేదు అని చూసి వాళ్ళకి కాల్ చేసాడు. ఈ సరి ఫోన్ నాన్న ఎత్తారు "ఏమైందిరా ఎక్కడున్నావ్" అడిగారు నాన్న

"నాన్న నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను" అన్నాడు కుమార్

నా: "ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు"

కు: "నన్ను చెప్పనివ్వండి నాన్న. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను. అలాగని మిమ్మల్ని వదులు కోలేను. నా వల్ల కావట్లేదు నాన్న నేను ఇలాగ రెండిటి మధ్యన ఉండలేక పోతున్నా " గబగబా చెప్పేసి బోరున ఏడ్చేసాడు.

నా: ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు ఏమి చేసుకుంటున్నాడో ఏమో అని భయాన్ని ఒక పక్కన దాచి ధైర్యం నటిస్తూ "అవన్నీ మనం మాట్లాడదాం ముందు నువ్వు ఎక్కడున్నావ్? సెలవ పెట్టి  ఇంటికిరా. ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడదాం"

కు: అతి కష్టం మీద మాటలు పలుకుతూ గుండె వేగం బాగా పెరిగిపోయింది...కళ్ళు ఏడ్చి ఏడ్చి చింత నిప్పులలాగా వున్నాయి..తన శరీరం మీద చీమలు పాకుతున్న గుర్తించలేని స్థితిలో వున్నాడు.."లేదు నాన్న నేను ఇంకా ఇంటికి రాను నా వల్ల కాదు ఇంకా ఈ నరకం అనుభవించటం..మీకు మీ పరువు ప్రతిష్టలు కావాలి..తనకి నేను కావాలి ..నాకు మీరిద్దరూ కావాలి ..మీరు తనని ఒప్పుకోలేరు... ఈ సమస్య ఎప్పటికీ తీరదు నాన్న"

నా: "నువ్వు చాలా కోపం లో వున్నట్టు వున్నావ్ ముందు ఎక్కడ ఉన్న ఇంటికి రా మనం కూర్చొని ఆలోచిద్దాము" ఏదో పిచ్చి పని చేయబోతున్నాడు అని అర్ధం అయ్యి గొంతులో ఆ భయం తెలుస్తోంది. 

కు: "నాన్న మీరు నాకు చాలా చేసారు నేను అడిగిందల్లా ఇచ్చారు. ఆ అమ్మాయి విషయంలో ఎందుకు నాన్న అంత పట్టుదల మీకు??"

నా: "ఆ అమ్మాయి విషయంలో పట్టుదల ఏమి లేదు రా నాకు నీ వెనుక మీ చెల్లి ఉంది ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే సమాజంలో మనం తలఎత్తుకోగాలమా??సమాజం సంగతి వదిలేయి ఆ అమ్మాయితో మేము కలిసి ఉండలేము రా....నేను ఈ ఊరిలో నా చిన్నప్పటి నించి ఉంటున్నా ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని  చేసుకుంటే నేను ఇంకా ఇక్కడ ఉండలేను వేరే ఊరు వెతుకోవలిసిందే "

కు: "ఇంకా మీకు ఆ కష్టం వుండదు నాన్న ఈ రోజుతో మీరు నా గురించి ఆలోచించకర్లేదు...ఒక వేళ మీరు ఆలోచించినా అది తెలుసుకొనే పరిస్థితిలో నేను ఉండను..నాన్న మీరు నాకు ఎంతో చేసారు దాని ఋణం నేను ఎప్పటికి తీర్చుకోలేను.."
ఇంకా మాట్లాడలేక ఫోను కట్ చేసేసాడు కుమార్.

తనలో ఎన్నో ఆలోచనలు...చాలా భయం...అలాగే చాలా ధైర్యం...రెండు ఒకే సారి  ఎలా వున్నాయో అర్ధం కాకుండా వుంది...ఒక క్షణం ఎంతో ధైర్యంగా అనిపిస్తోంది ఇంకొక క్షణం అయినవాళ్ళు గుర్తొచ్చి భయం వేస్తోంది....తను ఇన్నాళ్ళు సమాజం ముందు భయపడి ఆపుకున్న కన్నీళ్ళంతా ఒక్క ఉదుటున తన కంట్లోనించి రాలుతున్నాయ్...అలా ఏడుస్తూ ఎంతసేపు అక్కడ ఉన్నాడో తనకే తెలియదు...సెల్లు వంక చూస్తే ఇంటి నించి చాలా కాల్స్ వచ్చాయి. మళ్ళి వాళ్ళకి కాల్ చేసే ధైర్యం లేదు...అందుకే ఇంక సరోజకి చేద్దాం అని నిర్ణయించుకున్నాడు.

స: "హలో"
కు: " హాయ్ సరోజ...ఎక్కడున్నావ్??" సాద్యమైనంత దైర్యం నటిస్తూ మాట్లాడుతున్నాడు కుమార్
స: "రూములో వున్నాను...ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు పొద్దున్న...మీ రూమ్మేట్ కి కాల్ చేస్తే పొద్దునే బయటకి వెళ్ళాడు అని చెప్పాడు"
కు: " సరోజా నువ్వంటే నాకు చాలా ఇష్టం..నువ్వు లేకుండా నేను బ్రతకలేను"
స: "నాకు కూడా నువ్వంటే ప్రాణంరా...ఏంటి  ఇప్పుడు సడన్ గా  ఈ మాటలు ఎందుకు...ఏమైంది అసలు ఎక్కడున్నావ్"

ప్రాణం అన్న మాట వినగానే మళ్ళి కుమార్ కళ్ళలో నీళ్ళు తిరగడం మొదలైంది...

కు: " నేను చెప్పేది ఎదురు ప్రశ్న వేయకుండా విను...నీ లాంటి మంచి దానికి, అందగాత్తెకి నాకంటే చాలా మంచి కుర్రాడు దొరుకుతాడు. నేను నీకు సరిపోనురా..."

స: "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు...అసలు ఏమైంది...నువ్వు కాకుండా నేను ఎవరిని చేసుకోనని చెప్పాను కదా...అసలు ఏమి జరిగింది చెప్పు ? ఎక్కడ వున్నావ్??"
సరోజకి అంతా అయోమయంగా భయంగా వున్నది... తన్నుకు వస్తున్న దుఃఖాన్ని తన స్నేహితులకి తెలియకుండా ఆపటం చాలా కష్టం గా వుంది...చకచకా  మేడమేట్లు ఎక్కుతోంది.
కు:" సరు(సరోజ ముద్దు పేరు) నేను చెప్పేది  విను..మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు...మీ ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు...మన వాళ్ళని కాదని పెళ్ళిచేసుకోవడం మన ఇద్దరికీ ఇష్టం లేదు...ఈ పరిస్థితుల్లో మన పెళ్లి అవ్వటం అసంభవం..."

స: "మన పెద్దవాళ్ళని మారుద్దాం రా...వాళ్ళు మారతారు ఖచ్చితంగా...నిన్ను కాదు అని నేను ఎవ్వరిని చేసుకోనని చెప్పేసాను ఇంట్లో...చేసుకోను కూడా...ఎంతకాలమైనా పర్లేదు ఎదురుచూద్దాం...వాళ్ళని ఒప్పిద్దాం...అసలు నువ్వు ఎక్కడున్నావ్ అది చెప్పు ముందు.."

కు: "వాళ్ళు మారరురా...నాకు ఆ ఆశ చచ్చిపోయింది...అందుకే నేను కూడా చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నా"
సరోజకి గుండె ఆగినంత పని అయ్యింది...ఏమి చెప్పాలో తెలియదు...తన ఇంట్లో వాళ్ళ తర్వాత తనని అంతలా అర్ధం చేసుకున్న వ్యక్తి కుమార్...తనతో జీవితం పంచుకోవాలి అనుకుంది...గత రెండు సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఈ విషయం మీద...ఈ సంఘటనలు అన్ని ఒక్క రెండు సెకనులలో తన మదిలో తిరిగాయి...కుమార్ లేని తన జీవితం ఊహించటం కూడా అసాధ్యం తనకి...ఇప్పుడు తను కుమార్ ని ఆపాలి...తను కుమార్ ఇలాంటి పని చేస్తాడు అని కూడా అనుకోలేదు...ఎన్నో సార్లు తను భయపడి చనిపోదాము అనుకున్నా కుమార్ చక్కగా తన మాటలతో సముదాయించి ఆ ఆలోచనలు రాకుండా చేసేవాడు...అలాంటి కుమార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు...తనకి వున్న బలం కుమార్ తన బలహీనత కూడా కుమారే...కుమార్ కి ఏమన్నా చిన్న దెబ్బ తగిలినా సరోజ విలావిలాడిపోతుంది. తను తుమ్మగానే డాక్టర్ ని కలిసే దాక బుర్ర తినేస్తుంది...అట్లాంటిది కుమార్ చెప్పింది విన్నాక తన కాళ్ళ కింద నెల కదిలిపోయినట్లు అనిపించింది...ఎలాగైనా కుమార్ ని రక్షించుకోవాలి అనుకుంది కాని ఎలాగా అన్నది అర్ధం కావటం లేదు.

కు: "సరోజ వింటున్నావా" అటునించి సమాదానం రాక పోయే సరికి అడిగాడు కుమార్. కుమార్ కూడా సరోజ గురించి ఆలోచిస్తున్నాడు. తను ఇలా చెప్పటం సరోజాకి చాలా బాధ కలిగిస్తుంది అని తెలుసు కుమార్ కి. కాని తనకి ఇంతకంటే మంచి పరిష్కారం కనిపించలేదు.
స: "విన్నాను కాని నేను విన్నది నమ్మబుద్ధి కావట్లేదు...నువ్వేనా ఇలా మాట్లాడింది...ఇలాంటి నిర్ణయం తీసుకొనే ముందు నాకు ఒక్క సరి చెప్పాలి కదా...నీ కోసం నేను అన్ని వదులుకొని వచ్చేస్తానురా...నువ్వు అలాంటి పనులు ఏమి చేయకు...ఎక్కడ ఉన్నవో చెప్పు ముందు ...అసలు చావే దేనికి పరిష్కారం అయితే నేను కూడా వస్తాను నీకు తోడుగా ...ఇక్కడ ఎటు నీ తోడూ కాలేక పోతున్న కనీసం చావులో అవుతాను...ప్లీజ్ చెప్పవా"
ఏమి మాట్లాడుతోందో తనకి తెలియట్లేదు మదిలో మెదిలిన ప్రతి ఆలోచన అలాగా చెప్పేస్తోంది సరోజ...తనకి ఏడుపు వస్తోంది...కళ్ళ వెంట నీళ్ళు జలపాతం లాగా కారుతున్నాయి.
కు: "లేదురా...నువ్వు బాగుండాలి...నీకు మంచి జీవితం వుండాలి...ఇంట్లో ఒప్పుకోరు అని తెలిసి ప్రేమించటం నా తప్పు నా తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి.."

సరోజ ఇంక తను ఎంత చెప్పిన కుమార్ వినడని  అర్ధం అయిపొయింది....

స: "సరేరా నువ్వు చచ్చిపో నీ తప్పు కాబట్టి...కాని నా సంగతేంటి నీ కోసం నేను రెండేళ్ళగా ఇంట్లో గొడవ పడుతున్న ఇప్పుడు వాళ్ళకి ఎలా మొహం చూపించాలి...పోనీ వాళ్ళని వదిలేయి మీ తల్లిదండ్రులని ఎలా ఎదుర్కోవాలి...ఎప్పుడు నాతో చెప్తుండేవాడివి కదా...నీకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవటానికి నీకు తోడుగా నేను వుంటాను అని...నాకు తోడుగా ఎప్పుడు వుంటాను అని...అవన్నీ అబద్దాలా??...ఒక్క సారి ఆలోచించు...నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను...నువ్వే నా ప్రాణం రా...నువ్వే లేక పోతే నేను ఇంక ఎలా బ్రతకాలి??"

కుమార్ కి ఆ మాటలు తూటాల్లా తన గుండెని తాకాయి...ఇంక సరోజ తో మాట్లాడలేక కట్ చేసేసాడు.వెంటనే ఫోన్ మోగింది నాన్న కాల్ చేస్తున్నారు.

కు: "హలో"
నా: "అరేయ్ నాకు చాలా కంగారుగా వుంది అసలు ఎక్కడున్నావ్ చెప్పు ... నేను వస్తాను మనం మాట్లాడదాం.."
కు: " ఇంక మాట్లాడేది ఏమి లేదు నాన్న నేను చచ్చిపోదాము అని నిర్ణయించుకున్నాను" ఎక్కడినించో ధైర్యం తెచ్చుకొని చెప్పేసాడు కుమార్.

అనుకున్నదంతా జరిగింది అని నాన్న బాదపడుతూ వీడిని ఎలాగన్నా ఆపాలి అన్న తాపత్రయం తో ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు...

నా: "అంత పని చేయమాకు రా...మా ఆశలన్నీ నీ మీదే వున్నాయి...నువ్వు లేకుండా మేము ఉండలేమురా...అరేయ్ ఆ ఒక్క అమ్మాయి దక్కక పోతే చనిపోవలా చెప్పు...చినప్పటినుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చాం కదరా... ఈ ఒక్క విషయం లో ఎందుకు కాదంటున్నారు  అని ఆలోచించరా...నాన్నా నా మాట వినరా ఒక్క అవకాశం ఇవ్వరా నాకు నీతో మాట్లాడడానికి...నువ్వు లేకుండా మేము ఎలా వుండగలమురా...మీ అమ్మ అసలు తట్టుకోలేదు...ఒక్క అవకాశం ఇవ్వరా...నువ్వు ఎక్కడున్నావో చెప్పరా నేను వస్తాను కావాలి అంటే దూరం గా నుంచుని మాట్లాడతాను...ఇన్నేళ్ళు పెంచినందుకు ఒక్క అవకాశం ఇవ్వరా"

ఎప్పుడు ఎంతో గంబీరం గా మాట్లాడే నాన్న అంతలా బ్రతిమిలడుతుంటే సందిగ్దంలో పడ్డాడు కుమార్...తనని ఇంతలా ప్రేమించే అమ్మనాన్నలని, అమ్మాయిని వదిలేసి చనిపోవటం ఎంత వరకు భావ్యం అని ఆలోచనలు మొదలయ్యాయి... కాని తను ఇప్పుడు వెనక్కి తగ్గితే సమస్య మళ్ళి అలానే వుంటుంది అన్న ఆలోచన ఒక వైపు తొలచి వేస్తోంది...

నా: "అయినా నువ్వు చనిపోవాలి అనుకుంటే...నాకు చెప్పు నేను కూడా ఇక్కడ ఒక పురుగుల మందు డబ్బా తెచ్చుకొని అందరికి పోసి నేను తాగుతాను...నువ్వు చనిపోతే ఆ బాధ భరించే కంటే మేమి కూడా చనిపోవటం సులువు మాకు...అయినా చావు అనేది మార్గం కాదురా...నా మాట విను ఒక్క సారి కలువు నన్ను...దయ చేసి ఒక్క సారి కలువు " అని కంటతడి పెట్టుకున్నారు

ఒక్క సారి అందరి మాటలు విన్న కుమార్ కి తను చనిపోతే ఎంతమంది చనిపొతారో అని కళ్ళముందు కదిలింది...తన జీవితం లో ముఖ్యమైనవారందరూ చనిపోతారు అది కూడా తన వల్ల!!! అన్న ఆలోచన తన మెదడుని ఆక్రమించింది...చేతిలో వున్నా పురుగులమందు సీసా...కిందకి విసిరేసి తిరిగి రూముకి బయల్దేరాడు కుమార్...అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి ఎరుపు...కుమార్ కంటి ఎరుపు ముందు వెలవెల పోయింది...తను ఇంటికి, సరోజకి ఫోను చేసి తన నిర్ణయం చెప్పాడు..తరవాత ఇంకెప్పుడు కుమార్ ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు.

----------------*****కధ సమాప్తం*****------------------మీ నేస్తం




2011-03-11

ఇదేనా బాధని చూపించే మార్గము???

నిన్న మిలియన్ మార్చ్ లో విగ్రహాలు పడగొట్టటం నాకు ఎందుకో బాధ గా అనిపించింది. అవి ప్రాణం లేని విగ్రహాలు వాటిని పడేస్తే పోయేది ఏముంది అని అడగచ్చు నిజమే  వాటికీ ప్రాణం లేదు. కాని వాళ్ళకి ఈ ప్రాంతీయ గొడవలకి కూడా  ఎటువంటి సంబంధం లేదు. అసలు వాళ్ళు జీవించిన సమయం లో ఈ రెండు ప్రాంతాలు లేవు అని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు పాపం వాళ్ళ విగ్రహాలు ఏమి చేసాయి?

అంతగా మీ ఆగ్రహం  చూపించాలి అంటే పక్కనే సచివాలయం వుంది దానిముందు నిశబ్ద ధర్నా చేయాల్సింది. అందరు సచివాలయం ముందు నిల్చుంటారు కాని ఎవ్వరు మాట్లాడరు. ఇంతమంది జనాలని చూసి పోలీసులు తరమాలని చూసినా మీరు మాట్లాడక పోతే వాళ్ళు ఏమి చేయలేరు తోకముడుచుకొని మీరు ఎప్పుడు వెళ్తారో అని ఎదురుచూడటం తప్ప. వాళ్ళకి మిమ్మల్ని తరమటానికి ఒక కారణం కావాలి. మీరు ఆ కారణం ఇవ్వనంతవరకు వాళ్ళు ఏమి చేయలేరు. కాదని అంటారా???

ఈ రాజకీయనాయకులకి బుద్ధి ఎప్పుడు వస్తుందో?? ఈ గొడవలకి అంతం ఎప్పుడు చేస్తారో? ఇలాగే జాప్యం చేస్తుంటే రెండు ప్రాంతాల మధ్యన ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని భయం వేస్తోంది..

నాలాంటి జీవులకి ఏమి జరిగిన ఒకటే...మా ఆఫీసు ఉండక మానదు నేను వెళ్ళాక మానను కాని ఎంతో మంది విద్యార్ధుల హృదయాలలో, చిన్నపిల్లల మనసులలో ద్వేషపు జ్వాలలు నింపుతున్నారు అవి ఇప్పుడు రాజకీయనాయకుల స్వార్ద ప్రయోజనాలు సమకూర్చిన...తర్వాత అక్కడి సమాజానికి చాల చేటు చేస్తాయి...అది సమైక్యంద్ర ఐన సరే తెలంగాణా ఐన సరే...మీకు వున్నది ఒక్క అభిప్రాయ భేదం మాత్రమే...శత్రుత్వం లేదు...

మిమ్మల్ని రెచ్చగొట్టిన నాయకులూ రేపు అన్ని సద్దుమనిగాక తిరిగి కలిసిపోతారు..కాని మీరు అలా కాలేరు...అందుకే అందరికి నా విజ్ఞప్తి ఏంటంటే " మీ భావం/ప్రాంతం కోసం మీరు పోరాడండి తప్పు లేదు...కాని పక్క ప్రాంతం వాడి మీద ద్వేషం పెంచుకోవద్దు...వాడు మీకు అన్యాయం చేయలేదు రాజకీయ జూదంలో మీలాగే వాడు ఒక పావు అంతే..వాడు వాడి పొట్ట పట్టుకొని మీ లాగే పని వెతుకుంటూ వచ్చాడు...మీ అభివృద్ధి జరగలేదు అంటే అది రాజకీయాల తప్పు..కాని వేరే ప్రాంతంలో వున్నా సామాన్య ప్రజనీకానిది కాదు.


గమనిక: ఇది నా మనసులో ఉన్న భావము.ఏ ప్రాంతాన్ని కించపరచటం నా ఉద్దేశం కాదు. ఒక వేళ మీకు ఏమైనా అలాంటిది అనిపిస్తే నాకు తెలియచేయండి...సరి చేసుకుంటాను.
  

2010-11-18

ఆచారాలు: మైలు

చిన్నప్పటి నించి మనకి మన పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు. ఉదాహరణకి పగిలిన అద్దంలో తల దువ్వకూడదు, రాత్రిళ్ళు గోళ్ళు తీయకూడదు ఇలాగ. కాని ఎందుకు అని అడిగితే మాత్రం చాలావరకు "అది మన ఆచారం" అనో "అది అంతే" అనో సమాధానం వస్తుంది. నాకు ఇది నచ్చక నేనే సమాధానం వెతకటం మొదలు పెట్టాను. ఇవి కేవలం నా ఊహాజనిత కారణాలే  నిజమైన కారణాలు అవచ్చు కాకపోనువచ్చు.

ఈ మధ్య వరకు నేను మన పూర్వికులు ఈ కట్టుబాట్లు ఆచారాలు అసలు ఆలోచించకుండా అప్పటి వ్యవస్థ తగట్టు పెట్టారు అని అనుకున్నాను కాని ఈ మధ్యనే మా నాన్నగారు ఏదో ఒక సందేహం నివృత్తి చేసుకుందాము అని "పరాశర స్తుతి" అంతర్జాలం లో వెతికి పెట్టమన్నారు. ఎంత వెతికినా దాని ఆంగ్ల అనువాద ప్రచురణ మాత్రమే దొరికింది. నేను అందులో ఒకేఒక భాగము చదివాను ఆ  భాగము ఒక మనిషి పోతే ఎన్ని రోజులు మైలు పట్టాలి అన్నదాని మీద అది చదివాక వాళ్ళ ఆలోచనలు నాకు చాలా బాగా అర్ధం అయ్యాయి.

ఆ గ్రంధం ప్రకారం ఎవరు ఎలా పోయిన ఇన్ని రోజులు అని లేదు. మనిషి జబ్బు వాళ్ళ పోతే ఇన్ని రోజులు, విషప్రభావం తో పోతే ఇన్ని రోజులు ఇలా రాసి ఉంది. దాని బట్టి నాకు ఏమి అర్ధం అయ్యింది అంటే మైలు అన్నది వాళ్ళు పెట్టింది ఆ చావు వల్ల  వచ్చిన  హానికరమైన పదార్దాలు/క్రిములు ఎక్కువమందికి పాక కుండ వుండాలి అని ఇలాంటి కట్టుబాటు పెట్టారు అని అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదని.

ఇంకా పరాశర మహాముని మైలు లో ఇచ్చిన సవరణలు చదివాక నాకు వాళ్ళ దూరాలోచన ఏంటో తెలిసింది. అందుకే ఏమో పెద్దలు అంటారు "పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట" అని. కాని ఒకింత బాధగా అనిపించింది ఇంత బాగా ఆలోచించి ఆయన రాస్తే దానిని తరతరాలుగా మార్చేస్తూ వచ్చి దానికి విలువలేకుండా చేస్తున్నందుకు :( . ఆ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీకు ఏముంది అన్నది వివరంగా మళ్లీ రాయాలి అనుకుంటున్నాను ఈ లోపు మీకు ఓపిక తీరిక ఉంటే మీరే చదువుకోండి మీకు అర్ధం అవుతుంది అయన ఎంత బాగా ఆలోచించారో!!!

2010-03-01

నా ఆటను చేడకోడుతూ వచ్చింది అది/ఆడు

ఒకానొక వాన కురిసిన రాత్రి వేడిగా పకోడీలు తింటూ కమ్మగా పాత పాటలు వింటూ నేను కంప్యుటరులో జి టి ఎ ఆడుతుండగా మా రూములో ఏదో చప్పుడు అయ్యింది. అసలే రూములో పని పాడు లేకుండా ఖాళీగా ఉండేవాడిని నేనే కాబట్టి ఆడుతున్న ఆటని మధ్యలో ఆపి ఏంటా అని రూములో వెతకటానికి పోయాను. అన్ని చోట్ల వెతికాక ఏమి కనిపించక పోయే సరికి ఇది వాడి/దాని  పనే అయ్యుంటుంది అని నిర్ణయించేసుకొని మళ్ళి నా చుట్టుపక్కల నిశితంగా వెతకటం మొదలుపెట్టాను.

అలా వాడు/దాని కోసం ఏంటో వెతకగా అలిసి సొలసి ఇంకా వెతక లేక హాలులో మంచం మీద కూలపడిపోయాను. వాడిని/దానిని చంపేయాలి కాని ఎలాగా అని ఆలోచిస్తుండగా. మళ్ళి దాని/వాడి అరుపు నాకు చాలా దగ్గరలో వినిపించింది. ఆ అరుపుకి మళ్ళి నా వెతుకులాట మొదలుపెట్టి.సరిగ్గా నేను కూర్చున్న మంచం  కింద పెట్టిన బూట్లలోనుంచి మళ్ళి అరుపు వచ్చింది. ఈ సారి నా కోపం బి పి మీటరుకి కూడా దొరకకుండా పెరిగిపోయింది. వెంటనే దానిని చంపటానికి కర్రతీసుకువచ్చాను.

నేను కర్ర తీసుకొని సిక్స్ కొట్టే  సచినులాగా గోలు కొట్టే ధనరాజ్ పిళ్ళై లాగా రెడీ అయ్యి బూటుని కర్రతో కొంచెం కదిపాను. ఆ కుదుపుకి మెల్లమెల్లగా బయటకి వచ్చింది/వచ్చాడు. "మియ్య్యావ్వ్వ్ మియ్యావ్వ్వ్" అని అరుచుకుంటూ ఈ మధ్యనే మా వీధిపిల్లికి పుట్టిన పిల్లిపిల్ల. మూసినా కళ్ళని నెమ్మదిగా చిట్లిస్తూ తెరుస్తోంది. దానిని అలా చూసేసరికి నా చంపాలన్న కోరికని చచ్చిపోయింది. వెంటనే దగ్గరకి తీసుకోవాలి అనిపించింది కాని మళ్ళి ఇల్లుఅలవాటు అయితే ఇబ్బంది అని భయం వేసి దానిని నెమ్మదిగా తరిమేసాను.


గమనిక: ఆ పిల్లి పిల్ల ఆడదో మగదో తెలియక అది/ఆడు అని వాడాను. మీకు నచ్చిన జాతికి చెందినదిగా భావించి  చదవగలరు  

2009-10-12

నా అనుభవం -- వరద బాధితుల సహయం

చాలా రోజులయింది మీతో మాట్లాడి పనివత్తిడి వల్ల బ్లాగులో రాయటం కుదరట్లేదు. ఈ రోజు ఎలాగన్నా సరే మిమ్మల్ని పలకరించాలి అని గట్టిగా అనుకున్నాను.

ఈ మధ్య కాలంలో మీకు చెప్పగలిగిన సంఘటనలు చాలనే చోటు చేసుకున్నాయి కానీ సమయాభావం వల్ల అవన్ని రాయలేకున్నాను. ఐతే వాటన్నిటిలోకి ముఖ్యమైన సంఘటన చెప్తాను వినండి. నేను గత శనివారం కర్నూల్ దగ్గర వున్న పంచలింగాల అనె గ్రామానికి వరద బాధితులకి సహయం చేద్దాము అని వెళ్ళాను. మా సంస్థ వారే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మేము మొత్తం 30 మంది సహోద్యోగులం కలిసి వారికి పంచే బాధ్యత తీసుకున్నాము. మా సంస్థ లొ పని చెసె 150 మంది దాక ఉద్యోగులు ఒక రోజు జీతం ఈ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. అలగే మా సంస్థాధినేత కూడా సంస్థ తరుఫున ఉద్యొగులు ఇచ్చిన దానికి రెండింతలు చందాగా ఇచ్చారు.

ఈ డబ్బులతో మేము ఒక వెయ్యి కుటుంబాలకి నిత్యవసర సమాన్లు ఇద్దాము అని తీసుకెళ్ళము. గతంలో ఎవరికి ఇలంతి కార్యక్రమము చేసిన అనుభవం లేకపోవటంతో మేము ఒక వ్యుహం రూపొందించటానికి వివిధ వ్యక్తుల మరియు సంస్థల ల సలహాలు సూచనలు విన్న పిమ్మట క్రింది వ్యుహం ఆచరిద్దాము అని అనుకున్నాము.
ఆ వ్యుహం ఏంటంటే అక్కడ వుండే కొంతమంది గ్రామస్తుల సహకారంతో అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి మా సంస్థ ముద్ర వున్న చీటి ఒకటి ఇచ్చి ఒక బహిరంగ ప్రదేశానికి ఒక గంత తర్వాత రమ్మని చెప్పాము. అక్కద చీటి ఇచ్చన వారికి మేము ముందుగానే తయారు చేసుకున్న నిత్యావసరసమాన్లను ఇచ్చాము. ఈ రకం గా పంపిణీ చేయటం వల్ల మాకు చాలా గొడవ తగ్గింది మరియు సాధ్యమైనన్ని ఏక్కువ కుటుంబాలకు సహాయం చేసామన్న తృప్తి మాకు మిగిలింది. అక్కడ ఊరిలో వారి పరిస్థితి తలుచుకుంటె చాలా భాదగా అనిపిస్తుంది. ఆ ఊరు వరదల్లో పూర్తిగా మునిగిపొయిన వాటిలో ఒకటి. అందరిళ్ళలోనూ కనీసం ఒక అడుగులోతు బురద. కొందరి ఇళ్ళలోనైతే మూడునాలుగడుగుల లోతు బురద. భరించలేనంత దుర్వాసన. అందులోనే వాళ్ళు తమతమ ఇల్లు ని శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వమ్నించి ఎటువంటి సహాయం అందలేదు అని చెప్తున్నారు. అక్కడ విద్యుత్ ఇంకా రావట్లెదు. చాలా ఇళ్ళు వరదలో పాక్షికంగా దెబ్బతిన్నాయి. అక్కడి వారికి కొన్ని సంస్థలు సహాయానికి వచ్చినా వాళ్ళు ఒక కూడలిలో బండి ఆపి పంపిణీ చేయటంవల్ల అందరికి చేరటం లేదు.

ఇంకా చాలా విషయాలే ఉన్నయి కానీ సమయాభావం చేత ముగిస్తున్నాను. చివరిగా మీకు నా విన్నపం మీరు కూడా వరద భాదితులకి చేతనైనంత సహాయం చేయండి. మీరె ఈ సహయం ఏ రూపంలోనన్నా చేయచ్చు. మీకు చేయలి అని నున్నా ఎవరికి ఇవ్వాలి అని తెలియక పొతే నాకు చెప్పండి నేను మీరుండే ప్రదేశన్ని బట్టి ఎలా సహాయం చేయగలరో వివరాలు సేకరించి మీకు అందిస్తాను. లేదు మీరు మీ విరాళమేదన్నా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇద్దాము అనుకుంటే నాకు తెలిసిన ఒక సంస్థ వుంది దాని పెరు "నిర్మాన్" మీరు మీ విరాళం దానికివచ్చు. నిర్మాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోటానికి ఈ లంకెను వీక్షించండి http://www.nirmaan.org/