2009-11-19

నేను.... నా క్లయింటు.... నా పాట్లు

సమయం: సాయంత్రం 6:15
ప్రదేశం: మా కారాగారం శిఖరాగ్రం  (ఆఫీసు పైన ఉన్న ఖాళీ ప్రదేశం)

అప్పటి దాకా మా ఆఫీసువాళ్ళు పెట్టే ఫలహారం తినేసి ప్రశాంతంగా  నాగర్జునా ఢాన్సులాగా పడాదామా వద్దా అని వాన ఆలోచిస్తుండగా హాయిగా ప్రకృతి ని ఆస్వాదిస్తున్నాను. ఇంతలో నా సెల్లు నా పరవశానికి భంగం కలిగిస్తూ నా కాలు గడగడ లాడించింది (నిశబ్దంలో పెట్టాను ) ఏ వెధవ సొల్లు చెప్పటానికి చేసాడా అని చిరాగ్గా దాని వంక చూసాను. "వారపు పని చిట్టా" (వీక్లి స్టేటస్ రిపొర్ట్ ) చెప్పటానికి సమయమయ్యింది అని నా సెల్లు గంట మొగించి చెప్తొంది.

నాకు ఎక్కడ లేని బాధ ఇంకా వెంటనే పాకిస్తానుకి కాని తాలిబాను కి గాని వెళ్ళి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక "ఆత్మాహుతి దళ" యెధుడిని తెచ్చి మా క్లయింట్ మీదకి వదలాలి అన్నంత కోపం వచ్చింది. కానీ వాడి ఉప్పు తింటున్నాను అని గుర్తొచ్చి నా మనసుని, దాంట్లో  కోపాన్ని "గొద్రేజ్" బీరువాలో దాచేసి "స్వాతిముత్యం" కమల్ హాసన్ నవ్వు ఒకటి మొహాన పులుముకొని "సమావేశపు గదికి"(కాన్ఫరెన్స్ రూమూ) వచ్చాను. అక్కడ పొరాటానికి సిద్దమవుతున్న సైనికుడు తన అస్త్రాలు సరిచూసుకుంటునట్టు మా లీడు "లాపుటాపు" సర్దుతున్నాడు.

ఈ రోజు ఎంతసేపు బుర్ర తింటాడో అని గుండెల్లో భయంగా వున్నా పైకి మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతున్నా. ఇంతలో ఆ శుభగడియలు రానే వచ్చాయి. మా లీడు ఫొను కలిపాడు కాసేపు అర్ధం కాని భాషలో అమ్మనాబూతులు తిట్టించుకున్నాక కొన్ని మీటలు నొక్కితే మా క్లయింటు లైనులోకి వచ్చాడు.          

వస్తూవస్తూనే సుడిగాలిని తలపిస్తూ "HOWDY.. HOWDY..." ఒక అరుపు అరిచాడు

దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా పూర్వానుభవం వల్ల వాడు మేము ఎలా వున్నామో అని అడుగుతున్నడు అని అర్ధం చేసుకున్నాము. "బాగానే ఉన్నాము" అని ఆంగ్లంలో చెప్పాము. కానీ మనసులో మాత్రం "మా ఖర్మ కొద్ది నీ దగ్గర పడ్డాము" అని అనుకున్నాను

ఎంతైనా భారతీయులం మన సంస్కారమెలా మర్చిపోతామని "HOW R U *****" అని అడిగాము. దానికి వాడు "SUPERB" అన్నాడు. వెంటనే మాకు మూడింది అని రాత్రికి నిశాచరులని కలవక తప్పదని అర్ధమైపోయింది

జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపొయింది ఇంకా నష్టం జరగకుండా చూడాలి అని వెంటనే నష్టనివారణ  చర్యలు మొదలుపెట్టము. వాడికి అవకాశం ఇస్తే ఎక్కడ సొల్లు మొదలు పెడతాడో అని తుపాకి పేల్చగానే పరిగెత్తే ఉసియన్ బోల్ట్ లాగా మా మా లీడు "SHALL WE START WITH PLAN FOR CALL *****" అని అన్నాడు.

క్ల: "SURE........."

వెంటనే మొదటి దశలో సొల్లు తగ్గించిన మా లీడులో నాకు ముక్కొటి దేవతలు మూకుమ్మడిగా కనిపించారు. కాని మనసులో ఏదో మూల పొద్దునే స్కూలుకెళ్ళే పిల్లాడి లాగా నేను నా భుజాన ల్యాపుటాపు సంచి తగిలించుకొని సాయంత్రం 9:00 కి చూడబొయే 2012 ని తలుచుకుంటూ వస్తుండగా పక్కింటాళ్ళ పిచ్చి కుక్క ఎదురింటాళ్ళ నల్ల పిల్లి కలిసి సరదాగా వాకింగు చేస్తూ నాకు ఎదురు వచ్చాయే అయినా వీడు సొల్లు మొదలెట్టలేదు అని ఆనందిస్తుండగా

క్ల: "BUT I WANT US TO DO A SHORT BRAINSTROMING TODAY AFTER UR POINTS........." అన్నాడు

వెంటనే నా ఆత్మారాముడు నిద్రలేచి "ఛీ వెధవా!! జల్సా లో సునీలు లాగ నీకు ఏది సరిగ్గావినే అలవాటు లేదు... నీ ఆత్మారాముడిగా నీ బాధలు భరించలేక పొతున్నా అని నోటికొచ్చినవి కొన్ని రానివి కొన్ని తిట్టేసాడు"

వీడి తిట్ల కంటే మా క్లయింటు తిట్లే మేలు వాడు ఏమి తిట్టినా సగం అర్ధం కావని నా ఆత్మారాముడికి జో కొట్టి వాడి మాటల మీద దృష్టి పెట్టాను.

మా లీడు ఆరంభశూరత్వాన్ని కొనసాగిస్తూ మేమూ ఈ వారము చేసిన పనులన్ని వాడికి ఏకరువు పెట్టుకుంటున్నాడు. సరే ఈ సునామి త్వరలో నా మీదకి వస్తుంది అని బ్యాటింగ్ కి వచ్చేముందు వ్యాయామాలు చేసి దిగినట్టు ఒక్క సారి నేను ఈ వారం చేసినవన్నీ నేమరువేసుకుంటున్నా.. ఈలోగా నా వంతు వచ్చేసింది. నేను అనుకున్నవన్నీ చిన్నప్పుడు పాఠాలు అప్పచెప్పిన అనుభవంకొద్ది గడగడ అప్పచేప్పేసా.

"WELL...I APPRECIATE YOU EFFORTS BUT CAN YOU REPEAT IT ONCE AGAIN" అన్నాడు వాడు.

అరకిలోమీటరు పరిగెత్తి అక్తర్ బంతి విసిరితే అంగుళం కూడా కదలకుండా బంతిని ఆపిన ద్రావిడ్ మీద అక్తర్ కి ఎందుకు కోపం వచ్చిందో నాకు  అప్పుడు అర్ధం అయ్యింది. చేసేది లేక నేను నా పాఠం నెమ్మదిగా అప్పచేప్పాను.

"GREAT!!!.." అన్నాడు వాడు

హమయ్య!!! ఈ రోజుకి బ్రతికి పోయాను అని అనుకున్నా మనసులో. మిగితా వాళ్ళ పాఠం వింటుండగా నాకు కాస్త కునుకు పట్టింది. నిద్రపోతుంటే కలలో మా క్లయింటు అరుంధతి లో అఘోరా వేషం వేసుకొని నా బుర్రని సాయంత్రం తిన్న దోసతో నంచుకుతింటున్నాడు. "అయ్య బాబోయ్" అని టక్కున లేచి చూసాను.

మా క్లయింటు అప్పుడే వాడి కాఫీ తెచ్చుకొని మమ్మల్ని ఊరించే ప్రయత్నమో లేక సహజ తత్త్వమో తెలియదు కాని "బొమ్మరిల్లు" హాసిని లాగా గట్టిగా జుర్రుకుంటూ తాగుతున్నాడు. నాకు తిన్న అల్పాహారం అరిగిపోయి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి.  "నీ కాఫీలో కందిరీగ కూలా అని" మనసులో అనుకుంటూ దీనంగా గడియారం వంక చూసాను. అప్పటికే చిన్న ముల్లు ౩౦ డిగ్రీలు తిరిగేసింది(గంట గడిచింది అని నా కపిహృదయం ) ఇంకా వదలట్లేదు.

అప్పటికే అందరు ఏమి చేసారో ఏమి చేయబోతున్నారో చెప్పేశారు ఇంకా వెళ్ళచ్చు అనుకుంటుండగా "OK now lets start brainstroming on %^*(@@^&!&!**@^@#%#^&"  ఐదు నిముషాలు ఊదరగొట్టి "LETS SHARE OUR VIEWS" అన్నాడు .

మనకి ఇచ్చిన అంశం మీద అవగాహన వున్నా లేకున్నా మాట్లాడటం "గుంపు సంభాషణలలో"(గ్రూపు డిస్కషన్) అలవాటే కాబట్టి ఉత్సాహం ఆపుకోలేక "IN MY VIEW....." అని ఏదో వాగేశా. 

"YEAH THATS AN EXCELLENT THOUGHT BUT HOW CAN THIS FIT....." అంటూ దొరికారురా ఇంకా నాకు "నిన్ను వదల బొమ్మలి వదలా" అని వాడి స్టైల్ లో వాడు బుర్రలో  గుజ్జు తాగే కార్యక్రమంలో మునిగిపోయాడు.

పొద్దున్న కనిపించిన పిల్లి కుక్క గుర్తొచ్చి ఇంకో ఇద్దరు యోధుల్ని కూడా కొనాలి వాటికోసం అని అనుకుంటూ చుట్టూ చూసాను. అందరు  నా వంక వాడి మానన వాడు ఏదో  చెప్తుంటే ఎందుకురా నువ్వు మధ్యలో మాట్లాడవు (మరీ ఇంత సాత్వికం గా కాదు కాని అన్ని రాస్తే బాగోదు అని రాయట్లేదు) అనట్టు చూస్తున్నారు.

ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా సరే సమరసింహారెడ్డి సినిమా లాగా  నన్ను చంపటానికి ఎక్కడ స్కుటీలు, పాషను ప్లస్సులు వేసుకొని ఎక్కడ తరుముతారో  అని భయం వేసి మా లీడు వంక "అన్యదా శరణం నాస్తి" అనట్టు చూసాను.

దానికి మా లీడు నాకు పాంటు షర్టు వేసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా వంక భయపడకు అని చెప్పి
"ACTUALLY ***** the intention was like #!$$%%@^&!*!" అని ఏదో  సర్ది చెప్పాడు.

అలాగా చిన్న ముల్లు ఇంకో  30 డిగ్రీలు తిరిగే దాకా వాడు బుర్ర తిని వదిలితే చావు తప్పి కన్నులోట్టపోయింది లే ఫర్వాలేదు అనుకుంటూ సినీమా కి పరుగులు తీశాను.

ఇదండీ  మా క్లయింటుతో   నేను పడ్డ పాట్లలో ఒకటి.

                    

3 comments:

  1. బాగు బాగు ఫణివర్యా.. అంత చిరాకులో కూర్చొని కూడా ఇలా హాస్యాన్ని పండించిచావు .... జోహార్లు :)
    common situation we ppl generally face and the different thoughts we wud get... cud not stop laughing while reading this... its funny phani.. kudos..

    ReplyDelete
  2. ధన్యవాదములు శాంతి గారు మరియు ఫణి గారు

    ReplyDelete