"పెళ్లి అంటే నూరేళ్ళ పంట... ముట్టుకుంటే మంట... ఎందుకొచ్చిన తంట" వీటిలో ఏదో ఒకటి పెళ్లి కాని అమ్మాయి కాని అబ్బాయి కాని మనసులో అనుకునేదే. వాళ్ళు అలా అనుకోవటానికి వారి వారి కారణాలు చాలానే ఉంటాయి. ఇలాంటి పెళ్లి మీద నా ఆలోచనలు చెప్పాలి అని ఈ టపా:)
ఏదో సినిమా(తులసి అనుకుంట) లో వెంకటేష్ గుక్కతిప్పకుండా 2 నిముషాలు చెప్తాడు.పెళ్లి గురించి ఏడు నించి ఒకటి దాక అంకెలు వచ్చేటట్టు చెప్తాడు. నేను కూడా పెళ్లి గురించి అంతే క్లుప్తం గా చెప్పాలి అని అనిపించింది, కాని నాకు అంటే పెళ్లి కాకుండా ఇంట్లో వేరే వాళ్ళకి పెళ్లి పనులు చేసిన అనుభవం వున్న వాడికి కలిగే భావం ఏంటంటే పెళ్ళంటే " "ఏడు"(ఏడాది అని చదువుకోండి) కష్టపడి అమ్మాయి లేదా అబ్బాయి ని వెతికి "ఆరు" గంటల పాటు తంతు చేయించి "ఐదు" రకాలుగా(టీ,కాఫీ,నీళ్ళు,అల్పాహారం, భోజనం) అతిధులని సత్కరించి "నాలుగు" గోడల మధ్యన నాలుగొందల మందిని కోర్చోబెట్టి "మూడు" ముళ్ళు వేయించి "రెండు" కుటుంబాలని కలిపే "ఒక" రోజు" అంతే..
పెళ్లి జనాల కోసం కాని ఆ జంట కోసం కాదు. వాళ్ళ మధ్యన ప్రేమ ఎప్పుడు చిగురిస్తుందో నేను చెప్పలేను కాని పెళ్ళిలో నూటికి డబ్బై శాతం ప్రేమ పుట్టదు అని నా నమ్మకం. పెళ్ళికి ముందే ప్రేమలో పడితే వాళ్ళకి పెళ్లి చాలా ఆనందం గా వుంటుంది. పెళ్లి తర్వాత ప్రేమలో పడితే వాళ్ళకి పెళ్లి అంతే కంగారు,భయం, ఆనందం కలిపి మిక్సి లో వేసి కలిపినట్టు వుంటుంది. ఇష్టం లేని పెళ్లి అయితే నేను చెప్పకర్లేదు. ఇలాగ ఆ జంట భావాలు అక్కడ పరిస్థితిని బట్టి మారుతుంటాయి. కాని జనాలకి మాత్రం పెళ్లి అంటే మంచి ఆటవిడుపు చుట్టాలని కలిసి కబుర్లు చెప్పుకొని..కొందరు గొప్పలు పోవటానికి కొందరు చాడీలు చెప్పటానికి ఇలా రకరకాలు గా వాళ్ళ ఆనందం పొందటానికి ఏర్పరిచే వేదిక.
ఇక పెళ్ళిలో ఇంకో వర్గం జనాలు వుంటారు వాళ్ళే పెళ్లి పనులు చేసేవాళ్ళు. వాళ్ళని గుర్తించటం చాలా తేలిక పెళ్ళిలో అందరికంటే చెమటలు కక్కుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు అంటే వాడు పెళ్లి పనులు చేస్తున్నాడు అని అర్ధం. వాళ్ళకి పెళ్లి ఎలా జరిగింది అంటే చెప్పే సమాధానం ఇంత మంది వచ్చారు(భోజనాల లెక్క) ఇంత ఖర్చు అయ్యింది. వాడిని పెళ్లి కూతురు చీర రంగు తెలియదు పెళ్లి కొడుకు డ్రెస్సు తెలియదు అసలు తాళి కట్టాడో లేదో కూడా కొన్ని సార్లు తెలియదు.
ఇలా విబిన్నమైన వర్గాల జనాలు ఒక చోట మూగి చేసే తంతే పెళ్లి
ఇట్లు
మీ నేస్తం