2010-11-18

ఆచారాలు: మైలు

చిన్నప్పటి నించి మనకి మన పెద్దవాళ్ళు చాలా చెప్తుంటారు. ఉదాహరణకి పగిలిన అద్దంలో తల దువ్వకూడదు, రాత్రిళ్ళు గోళ్ళు తీయకూడదు ఇలాగ. కాని ఎందుకు అని అడిగితే మాత్రం చాలావరకు "అది మన ఆచారం" అనో "అది అంతే" అనో సమాధానం వస్తుంది. నాకు ఇది నచ్చక నేనే సమాధానం వెతకటం మొదలు పెట్టాను. ఇవి కేవలం నా ఊహాజనిత కారణాలే  నిజమైన కారణాలు అవచ్చు కాకపోనువచ్చు.

ఈ మధ్య వరకు నేను మన పూర్వికులు ఈ కట్టుబాట్లు ఆచారాలు అసలు ఆలోచించకుండా అప్పటి వ్యవస్థ తగట్టు పెట్టారు అని అనుకున్నాను కాని ఈ మధ్యనే మా నాన్నగారు ఏదో ఒక సందేహం నివృత్తి చేసుకుందాము అని "పరాశర స్తుతి" అంతర్జాలం లో వెతికి పెట్టమన్నారు. ఎంత వెతికినా దాని ఆంగ్ల అనువాద ప్రచురణ మాత్రమే దొరికింది. నేను అందులో ఒకేఒక భాగము చదివాను ఆ  భాగము ఒక మనిషి పోతే ఎన్ని రోజులు మైలు పట్టాలి అన్నదాని మీద అది చదివాక వాళ్ళ ఆలోచనలు నాకు చాలా బాగా అర్ధం అయ్యాయి.

ఆ గ్రంధం ప్రకారం ఎవరు ఎలా పోయిన ఇన్ని రోజులు అని లేదు. మనిషి జబ్బు వాళ్ళ పోతే ఇన్ని రోజులు, విషప్రభావం తో పోతే ఇన్ని రోజులు ఇలా రాసి ఉంది. దాని బట్టి నాకు ఏమి అర్ధం అయ్యింది అంటే మైలు అన్నది వాళ్ళు పెట్టింది ఆ చావు వల్ల  వచ్చిన  హానికరమైన పదార్దాలు/క్రిములు ఎక్కువమందికి పాక కుండ వుండాలి అని ఇలాంటి కట్టుబాటు పెట్టారు అని అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదని.

ఇంకా పరాశర మహాముని మైలు లో ఇచ్చిన సవరణలు చదివాక నాకు వాళ్ళ దూరాలోచన ఏంటో తెలిసింది. అందుకే ఏమో పెద్దలు అంటారు "పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట" అని. కాని ఒకింత బాధగా అనిపించింది ఇంత బాగా ఆలోచించి ఆయన రాస్తే దానిని తరతరాలుగా మార్చేస్తూ వచ్చి దానికి విలువలేకుండా చేస్తున్నందుకు :( . ఆ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీకు ఏముంది అన్నది వివరంగా మళ్లీ రాయాలి అనుకుంటున్నాను ఈ లోపు మీకు ఓపిక తీరిక ఉంటే మీరే చదువుకోండి మీకు అర్ధం అవుతుంది అయన ఎంత బాగా ఆలోచించారో!!!

2010-11-02

దీపావళి నిజంగా కాలుష్యం చేస్తుందా??

చాలా మంది మిత్రులు దీపావళికి మనం కాల్చే టపాసుల వలన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం జరుగుతాయి అని కాబట్టి దీపావళికి టపాసులు కాల్చొద్దు అని నాకు చెప్పారు. నేను చాలా ఆలోచించగా నాకు అనిపించినా కొన్ని విషయాలు చెప్దాము అని ఈ టపా రాస్తున్నాను. పాతకాలం లో  దీపావళికి ఎవరి ఇళ్ళలో వాళ్ళు టపాసులు చేసుకొనే వారని మా నాన్న చెప్తుంటారు. అప్పుడు ఇంటిలో చేసే టపాసులు అంత హానికరమైనవి చేయరు. మన ఇళ్ళలో పెద్దవాళ్ళకి తెలుసు ఏదైనా ఎక్కువ చేయకూడదు అని. అందుకే ఎక్కువ శబ్దం రాకుండా తయారు చేస్తారు.

అందుకే పూర్వం దీపావళి పండగ చాలా బాగా జరిగేవి వెన్నముద్దలతో, సిసింద్రిలతో, ఇంకా మా నాన్న చాలా చెప్తారు కాని నా బుర్రలో ఈ రెండే మిగిలాయి. ఏ టపాసులోనైనా మూడు రసాయనాలు వుంటాయి ఇంకా ఎక్కువ వుంటే అవి రంగులకోసమో, శబ్దం కోసమో, లేక రకరకాల ఆకారాలకోసమో కలుపుతారు. ఆ మూడు రసాయనాలు వల్ల వాతావరణానికి  హాని కలిగించనివి  అయితే చాలు మనం కాలుష్యం చేయనట్టే.

శబ్దకాలుష్యం కేవలం పెద్ద బాంబుల వల్లనే కలుగుతుంది చిన్నచిన్న బాంబులు నిర్దేశిత శబ్ద ప్రమాణాలలోనే   పేలతాయి. ఇక వాయు కాలుష్యాన్ని ఆపటానికి రంగులు వచ్చే వాటి జోలికి పోకుండా వెళ్తే చాలు చాలా కాలుష్యం తగ్గించిన వారవుతారు.

దీపావళి నాడు టపాసులు కాల్చేది కేవలం పండుగకోసం మాత్రమే కాదు వానల వల్ల బాగా పెరిగిపోయిన దోమలని చంపటానికి కూడా ఉపయోగపడుతుంది.

ఆఖరికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, డాబుకి పోకుండా మతాబులు, కాకరపువత్తులు, చిచ్చుబుడ్డులు, భుచక్రాలు ఇంకా ఇలాంటి చిన్నచిన్న వాటితో దీపావళి జరుపుకోండి మీ జేబుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2010-10-26

కవిత: ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే

మొదటి సారి గగన ప్రయాణం చేస్తున్న ఒక వ్యోమగామి అంతరిక్షంలోనించి భూమిని చూస్తూ.....

కనుబొమ్మల ముందు కనపడు గోళమున
కనువిందు చేయు పచ్చిక కాన రాగ
కన్నులముందర గ్రహాలూ బంతులు కాగా 
ధరణిని గాంచినాతడు మిక్కిలి సంతసించే!


కాంతులీను తారల నడుమ మనసు మోహనరాగమాలపించగా
కనురెప్పలు గ్రహగతులకు తాళము వేయగా
తేలియాడు శరీరము తాళమునకు నాట్యమాడగా
కనుమరుగవుతున్న ధరణి కాంతులాతని కన్నుల గాంచె!!

రెండవ కవితకి ఆలోచన మరియు సహకారం అందించిన శాంతి కి ధన్యవాదములు

2010-10-25

నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???

అది జనవరి మాసం...సంక్రాంతి సమయం... దూరం గా నక్కలు నిద్రపోతున్న సమయం...దగ్గరలో ఉన్న కోళ్ళు కూస్తున్న సమయం.నలుపంటే  ఇష్టంలేని రామేశం రామేశ్వరం నించి తిరిగి వస్తున్న సమయం.....

రామేశం రామాలయం సందు తిరుగుతుండగా అడ్డం గా ఒక నల్ల కుక్క తన వీపు మీద నల్ల పిల్లిని ఎక్కించుకొని ఎదురుగా వచ్చింది. దానిని చూడగానే రామేశం రామనామం జపించటం మొదలెట్టాడు. అలాగే భయపడుతూ నల్ల పిల్లి కుక్కని చూసాను ఏమవుతుందో అని అడుగులోఅడుగు వేసుకుంటూ వెళ్తుండగా వయ్యారం గా వచ్చింది నల్ల చీరకట్టుకొని నీలాంబరి. రామేశాన్ని చూస్తూనే "ఏరా రాము ఎలాగున్నావ్!!! పొద్దెక్కింది ఇంకా నిద్రలేవలేదా" అని అన్నది.

"అదేంటి నేను నడుస్తుంటే నిద్రలేవలేదా అంటుంది నీలాంబరి ఆంటి" అని ఆలోచిస్తూ అలా నడక ముందుకి కొనసాగించాడు మన రామం. ఇంటిదేగ్గరకి వెళ్ళగానే నల్ల పిల్లి ప్రభావం వల్ల నాన్న ఏమన్నా వాకిట్లో ఉన్నాడేమో అని తోంగిచూసాడు. అమ్మ పేడనీళ్ళు కలుపుతోంది. నాన్న జాడ లేదు. హమయ్య నాన్న లేడు ఇంతకీ అమ్మ కలిపేది  "నల్లావు పేడా??? లేక తెల్లావు పేడా???"  అని ఇంట్లో అడుగుపెట్టాడో లేదో రామం ని చూడని వాళ్ళమ్మ పేడ నీళ్లు ఒక చెంబుతో తటాలన రామం మొహం మీద కొట్టింది.

వాసన చూస్తూ "హమయ్య తెల్లవుపేడే" అని కళ్ళు తుడుచుకుంటున్న రామం ఎదురుగా కనపడింది రాత్రి కప్పుకున్న బొమ్మల దుప్పటి నల్లని అంచు నీటిలో బాగా తడిచి బొటబొటా కారుతూ. దుప్పటి తీసి చూస్తే అదే నల్ల చీర కట్టుకొని నీలాంబరి  ఆంటీ అమ్మ తో మాట్లాడుతూ..తిరిగి చూస్తే ఎర్రటి కళ్ళతో నిప్పులు చెరుగుతున్న నాన్న.....

ఇట్లు
మీ నేస్తం

2010-10-18

నా ఆలోచనలు -శీలం

నాకు ఈ రోజు చాలా చిరాగ్గా వుంది...ఏమి చేద్దాము అని ఆలోచిస్తుండగా నాకు ఒక టపా రాయాలి అనిపించింది. ఈ టపా మీకు అందరికి రుచించక పోవచ్చు. ఇవన్ని నా ఆలోచనలే కాని అన్ని ఒప్పులే అని నేను అనటం లేదు. నేను మాట్లాడబోయేది శీలం అనే దానిమీద.

దయ చేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు అని మనవి చేసుకుంటూ ఇక అసలు విషయానికి వస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ పదం  గురించి చాలా సందేహాలు ఉండేవి. నేను చదివానో లేదో తెలియటానికి పరీక్షలు పెడతారు మరి ఒకడికి శీలం వున్నదా లేదా అని తెలుసు కోవటానికి ఏ పరీక్ష పెడతారు అన్నది నా చిన్ననాటి సందేహం. నేను పదవ తరగతి చదివేడప్పుడు వచ్చిన ఒక సినిమా వల్ల శీల పరీక్ష అని ఒకటి వుంది అని విన్నాను తర్వాత కొంచెం ఇంజనీరింగ్ వయసు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా ఒక పత్రిక లో "ఈ శీల పరీక్ష ఎంత వరకు నమ్మకమైనది?" అన్నదాని మీద వ్యాసం ప్రచురించారు. దాని ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే ఆ పరీక్ష ఫలితాలు నిజంగా శీలాన్ని కొలవలేవు అని. వివరాలలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్న.


తర్వాత ఉద్యోగం లోకి వచ్చి ప్రపంచం నా కంటితో నేను స్వయం గా చూడటం మొదలెట్టాక అర్ధం అయ్యింది శీలం అంటే ఏంటో. "శీలం అంటే నీ వ్యక్తిత్వాన్ని విడనాడకుండా జీవించటం" అని.

కాని సమాజం దృష్టిలో వాటికి ఒక నిర్వచనం వుంది దాని ప్రకారం కేవలం స్త్రీలకే పరిమితం చేసారు. ఇది ఎందుకు వాళ్ళకే పరిమితమో నాకు అర్ధం కాలేదు. ఒక స్త్రీ శారీరక సంబంధం కలిగి వుంటే తన శీలం పోయింది అని అంటుంటారు మరి అది చేసేది ఒక పురుషుడితో ఐనప్పుడు వాడి శీలం పోలేదా.శీలం ఏమన్నా కేవలం ఆడవారికే పరిమితమైన శరీరభాగామా నాకు తెలిసినంత వరకు కాదు. శీలం అన్నదానికి నైతిక కొలమానం తప్ప శాస్త్రీయ కొలమానం లేదు. ఒక స్త్రీకి శీలం పోయింది అని వివాహం ఆడటం మానేస్తే అలాగే ఒక పురుషుడి శీలం పోయిన కూడా వివాహం ఆడటం మానేయాలి. శీలం అన్నది ఆడవారికి మాత్రమే వుంటుంది అన్న అపోహ తొలగించుకోవాలి.

చివరాకరికి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే శీలం అన్నది అందరికి వుంటుంది. శారీరక సంబంధం వాళ్ళ అది పోదు అది మానసికమైన భావం. దానికి కొలమానం లేదు కేవలం తనకి తానూ గా మాత్రమే తెలుసుకోగలిగే భావం. మీ శీలం మీరు నిలబెట్టుకోవాలి అంటే మీ వ్యక్తిత్వాన్ని దేనికోసం వదులుకోవద్దు..


గమనిక: మీకు ఈ టపా నచ్చక పోతే దయ చేసి మన్నించగలరు

ఇట్లు
మీ నేస్తం

2010-10-15

దసరా/విజయదశమి శుభాకాంక్షలు

మషిషాసురుని ఒక సబల చంపినా

రావనాసురుని ఒక విల్లుకాడు చంపినా

చెప్పే సూక్తి నీలోని చెడుని చంపమనే

చెప్పే నీతి చెడుదోవ పట్టొద్దనే

2010-09-23

కవిత: ఎందుకమ్మా కోపం???????????????

అలసిన వేళ పసిడి కాంతులతో సేద తీరుస్తావు

విరహపు వేళ చల్లని వెన్నెలతో తోడు అందిస్తావు

ప్రణయపు వేళ కొంటె చూపులతో సయ్యాటలు ఆడతావు

నిశిరాత్రి వేళ దరిచేరు జాబిలమ్మ ఈ నడిజామున నీకేల కోపమమ్మ!!!!

 

2010-06-23

బిచ్చగాళ్ళు vs ఫణి

నేను ఈ రోజు హైటెక్ సిటీ మీదుగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ చాలామంది చిన్నపిల్లల్ని అడుక్కోవటం చూసాను. వేసే వాళ్ళు వేస్తున్నారు లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా సిద్ధాంతాల ప్రకారం వాళ్ళకి దానం చేయకూడదు  అనుకుని నేను వచ్చేసాను. కాని మనసులో ఏదో ఒక మూల అదే మెదులుతూ వుంది. దాదాపు ఒక కుటుంబం మొత్తం అక్కడే అడుక్కుంటూ బ్రతుకుతోంది. వాళ్ళందరిని కొందరు నీచం గా చూస్తారు కొందరు జాలితో చూస్తారు కొందరు విరక్తితో చూస్తారు. నిజానికి వాళ్ళకి నా లాంటి వాళ్ళకి తేడా ఏంటి అని అనిపించింది.

ఏంటి వీడికి మతి గాని పోయిందా? వాళ్లతో పోలికేంటి అని అనిపించచ్చు కాని ఏమో ఆలోచనలకి అంట తర్కం తెలియదు కద...

నేను అలా అనుకున్నాక వాళ్ళకి నాకు మధ్య ఉన్న సారుప్యాలు ఇంతా అని ఆలోచించాను. అవి ఈ విధం గా వున్నాయి
౧. వాళ్ళు పొద్దున్న నించి రాత్రిదాకా పని చేస్తారు నేను చేస్తాను
౨. వాళ్ళు డబ్బులు వేసిన వాడిని గొప్పవాడిగా చూస్తారు నేను నాకు ఉద్యోగం ఇచ్చిన వాడిని గోప్పవాడిలా చూస్తాను
౩. వాళ్ళు డబ్బులు వేయక పోతే తిట్టలేరు(అప్పుడప్పు తిడతారు కూడా!!!) నేను ఉద్యోగం ఇవ్వని వాడిని తిట్టలేను(నేను అప్పుడప్పుడు కూడా తిట్టలేని పరిస్దితి :()
౪. వాళ్ళకి రోజు ఇంత సంపాదించాలి అని టార్గెట్లు వుంటాయి నాకు రోజు ఇంత పని చేయాలి అని టార్గెట్ వుంటుంది

ఇంకా ఇప్పుడు బేదాలు చూద్దాము
౧. వాళ్ళు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సెలవ పెట్టొచ్చు నేను పెట్టలేను
౨. వాళ్ళు డ్యూటీ ఎప్పుడన్నా దిగాచ్చు నేను చచ్చినట్టు ౮ గంటలు పని చేయాలి
౩. వాళ్ళకి సెలవపెడితే ఆ రోజు తిండి ఉండకపోవచ్చు కాని నాకు సెలవ పెడితే జీతం ఇస్తారు
౪. వాళ్ళు ఎండలో పని చేయాలి నేను ఏ.సి. లో పని చేస్తాను
౫. వాళ్ళని సంఘం లో గుర్తింపు వుండదు  కాని  నాకు కొద్దో గొప్పో వుంటుంది
౬. వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది చేయచ్చు కాని నేను అలా చేయలేను మనసు చంపుకొని సంఘం చెప్పినట్టు చేయాలి


పైన పేర్కున్న అంశాలన్నీ చూసి నేను ఆలోచిస్తుండగా నా తలకాయ ఒక మొట్టికాయ వేసి వెధవ వాడి పని గురించి అలోచించి నీ పని ఎగొట్టక పని చేసుకో అని నాలుగు చివాట్లు పెట్టి ఆఖరికి నేను ఎందుకు పని చేయాలో హితబోధ చేసింది
"అందరు బిచ్చంఎత్తుకుంటే బిచ్చం వేసేవాడు వుండదు కద..నీ జాలి మీద వాడు బ్రతుకుతున్నాడు కాని నువ్వు నీ బుర్ర బుద్ధి ఉపయోగించి సంపాదించినా డిగ్రీ తెలివితేటలూ వాడి బ్రతుకుతున్నావ్ ఒకడు నీ మీద జాలి పడి ఉద్యోగం ఇవ్వడు నీ డిగ్రీ చూసి ఇస్తాడు" అని చెప్పి హాయిగా  అది నిద్రలోకి జారుకుంది నేను మా క్లయింటు పెట్టిన బగ్గుల చిట్టా చూసుకుంటూ కూర్చున్న


నోట్: ఇది ఎందుకు రాసానో నాకు తెలియదు కాబట్టి నన్ను అడగద్దు

2010-06-07

వేదం-ఒక మంచి సినిమా

 నేను ఎప్పటికీ సినిమా రివ్యూ రాయకోడదు అనుకున్నా కాని ఎందుకో వేదం గురించి రాయాలి అనిపించింది.

వేదం నాకు చాలా బాగా నచ్చింది. కధాపరంగా చాలా మంచి సినిమా. ఒక సినిమాలో ఆరుగురు విబిన్నమైన పాత్రలను చూపటం మరియు  అన్ని పాత్రలకి సమప్రాధాన్యత ఇవ్వటం నాకు బాగా నచ్చాయి. ఈ సినిమాకి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు నటులని దృష్టిలో పెట్టుకొని కాక మంచి కధ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే బాగుంటుంది.

సినిమా చాలా వరకు బాగుంటుంది అక్కడక్కడ కొంచెం వేగం తగ్గినా కొంచెం చిరకనిపించినా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం వేదం. చాలా వరకు సన్నివేశాలు వాస్తవానికి దగ్గరలో వుంటాయి. ఒక్కడే 100 మందిని కొట్టటం నేను పులి అని నేను చిరుతని సోడాలు కొట్టటం లేకుండా కేవలం కధలో పాత్రలనే చూపించారు.

 ఇంకా స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. నోటిలేక్కల్లో  అయితే నాకు తెలిసి అన్ని పాత్రలకి సమానం గా సన్నివేశాలు వున్నాయి. ఎన్నో రోజులనించి ప్రేమకధలు,గొడవలు కొట్లాటలు, రాజకీయాలు చూసి విసిగిన నాలాంటి వాడికి ఈ సినిమా మంచి ఆటవిడుపు.

ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సినిమా కధ కోసం చూడండి అనుష్క కోసమో, మనోజ్ కోసమో, అర్జున్ కోసమో లేక క్రిష్ కోసమో కాకుండా కధ కోసం మాత్రమే వెళ్ళండి. మీకు తప్పక నచ్చుతుంది అని నా నమ్మకం.

2010-05-31

నన్ను చేరగా రావా చెలి................

చిరుగాలుల అలజడిలో నిలిచిన ఈ చిరుదీపాన్ని  కాపాడగ  రావా  చెలి  ఈ  వెన్నలరాతిరిలో
కాలిఅందియల  సవ్వడికోసం  విలపించే  నా  హృదయాన్ని ఓదార్చగ రావా చెలి ఈ వేకువజాములో
కంటిపాపల కవ్వింతలులేక కన్నీరైన నా జీవితాన్ని వెలిగించగా రావా  సఖి  ఈ  నడిజాములో
మెరుపులా మెరిసిన నీ జాడలేక తపిస్తున్న నా ఎదని ఆక్రమించగా రావా సఖి ఈ సాయంసంధ్యలో

2010-05-07

ఎండాకాలపు వాన చిత్రాలు

చినుకుల సవ్వడిలో చిన్నారుల పడవల ఆటలు
పగిలిన గుండెలతో రైతుల మూగ మాటలు
నిలిచిన నీటితో  ఉద్యోగుల బాధలు
ఇవ్వేలే ఎండాకాలపు వాన చిత్రాలు

2010-05-06

ఎందుకింత నిర్లక్ష్యం???

 నిన్న నేను హైదరాబాదు పోలీసుల సోదాల గురించి వారి కష్టాల గురించి టపా రాసి ఇంటికి బయల్దేరాను. ఈ లోపు మా రూమ్మేట్ ఫోను చేసి బి+ రక్తం కావాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు వుంటే కేర్ ఆసుపత్రికి పంపమన్నాడు. నాలుగు నెలల పాప కి ఓపెన్ హార్ట్ సర్జరీ అంట ఆపరేషను అయ్యిపోయింది కాని పాప కి ప్లాటిలెట్స్  కావాలి అంట. అందరం ఆసుపత్రికి వెళ్ళాము టపా రాసిన ప్రభావమో  లేక పోతే మనసులో బలంగా నటుకుపోయిందో తెలియలేదు కాని అక్కడ నేను మొదట గమనించింది మాత్రం భద్రత ఏమాత్రం వుంది ఇంత పెద్ద ఆసుపత్రికి అని. నేను నా బ్యాగ్గు వేసుకొని లోపాలకి వెళ్తుంటే దానిని తెరిచి చూసిన పాపానికి ఎవడు పోలేదు.

లోపలి వెళ్ళేటప్పుడు ద్వారం వద్ద మాత్రం ఒక మెటల్ గుర్తించే ద్వారం వుంది (దానిని ఏమి అంటారో నాకు తెలియదు ) అందులోనించి అందరు వెళ్ళాలి. పోనిలే కనీసం ఇదన్నా వుంది అనుకొని లోపలి వెళ్ళాను. కాని లోపలి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే లోపలి రావటానికి ఇది ఒకటే కాదు చాలా మార్గాలు వున్నాయి అక్కడ కనీసం ఒక గార్డు కూడా లేడు అని. బంజారా హిల్స్ సెంటరులో ఉన్న ఆసుపత్రి అది.. దానికి చాలా పెద్ద పెద్ద హొదాలో వున్నవారు చికిత్సకి వస్తారు . అప్పట్లో బాలకృష్ణ,రామలింగరాజు, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడే వైద్యం చేయించుకున్నారు అని చదివాను.

ఇంకా సామాన్యులు చాలామందే అక్కడికి వైద్యం కి వెళ్తారు. మరి ఇంత మంది అక్కడ వుంటారు కదా వాళ్ళకి ఆసుపత్రి కల్పించే భద్రత ఎంత అంటే గుండు సున్నా... ఒకవ్యక్తి బ్యాగ్గు లో ఏదైనా పెట్టి అక్కడ వదిలేసి వెళ్ళినా పట్టించుకొనే దిక్కు లేదు. నగరంలో తీవ్రవాదుల ముప్పు వుంది అని వార్తలు వచ్చినా ఇంకా ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంట ఫీజులు తీసుకొనే ఆసుపత్రి కనీస బాధ్యతల్లో  ఇది ఒకటి కాదా? సినిమా హాలు లో సరైన భద్రత లేకపోతే అప్పట్లో పోలీసు వారు హాలు మూసేసే వారు  అలాగే ఆసుపత్రులు కూడా సోదా చేసి సరైన భద్రత లేని ఆసుపత్రుల చిట్టా ఒకటి పత్రికల్లో ప్రచురించాలి ప్రజలని ఆ ఆసుపత్రులతో జాగ్రత్త అని అప్రమత్తం చేయాలి.. నలుగురు సరైన భద్రత సిబ్బందిని పెట్టలేను ఆసుపత్రి యాజమాన్యానికి లక్షలు కుమ్మరిస్తున్న రోగులు కూడా ఒక్కసారి అడగాలి ఎందుకు నీకు ఇంత ఇవ్వాలి కనీస భద్రత లేనప్పుడు అని ? ఈ ఆసుపత్రి కాక పోతే ఇంకో ఆసుపత్రి నాకు తెలిసి హైదరాబాదులో డాక్టర్లకి కొరత లేదు..

రోగుల భద్రత మీద ఇంత నిర్లక్ష్యం ఉన్న ఆసుపత్రి యాజమాన్యం రోగుల కష్టాలని పట్టించుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు. నా ఉద్దేశంలో మానవత్వం మరియు బాధ్యత లేని వైద్యం వైద్యమే కాదు.

2010-05-05

పాపం హైదరాబాదు పొలీసులు....:(

మొన్న నేను ఆఫీసునించి రూముకి బస్సులో వెళ్తున్నా. మాధాపూర్ నించి మా రూము 14 కిలోమీటర్లు. అందుకే రోజు బస్సు ఎక్కి నిద్రపొవటం నా అలవాటు. అలాగే మొన్న కూడా నిద్రపొతుంటే మసబ్ టాంక్ దగ్గర బస్సు ఆపేసారు. నేను నిద్రలేచి ఎందుకు అని అలొచించేలొపే ఒక కానిస్టేబుల్ వచ్చి "బ్యాగ్గు తెరిచి చూపించండి" అని అడిగాడు. నేను అలానే చేసాను. బస్సులో అందరివి చూసి వాళ్ళు వెళ్ళిపొయారు. కాని వాళ్ళ ఆలొచన నా మనసు నించి వెళ్ళలేదు.

ఇప్పట్లో టిఫిన్ బాక్స్ బాంబులని, మానవ బాంబులని ఉగ్రవాదులు ఏన్నొ కొత్త విధాలలో దాడి చేస్తుంటే వాటిని ఎదుర్కొటానికి పొలీసులకి వున్నవి అరకొర మెటలు డిటెక్టర్లు, పొలీసు కుక్కలు. మా బస్సు లో ఎక్కిన వాళ్ళకి ఐతే ఆ సదుపాయాలు కూడా లేవు. మా బస్సులో కనుక ఇలాంటి బాంబు ఏదైనా ఉండి ఉంటే అందరము ఈ పాటికి పొయుండెవాళ్ళం. మా సంగతి ఇప్పటికి పక్కన పెడితే ఆ చెకింగ్ కి వచ్చిన పొలీసులకి తెలుసు వాళ్ళ దగ్గర వున్న ఆయుధాలు ఎందుకు పనికి రావు అని.. ఒక వేళ నిజంగా అక్కడ తీవ్రవాది ఉండి ఉంటే వాడి దగ్గర తుపాకి అన్నా ఉండి ఉంటుంది దానిని ఆ కానిస్టబుల్ లాఠితో ఎలా ఎదుర్కొగలడు??

ఒకవేళ ఎక్కడన్నా ఒక బాంబు పేలితే వచ్చే మొదటి విమర్శ "ఇది కేవలం నిఘా వర్గాల వైఫల్యం" లేక పొతే "ఇది మన పోలీసు వారి వైఫల్యం". ఈ విమర్శలు  చేసేది మంత్రులు ఇంకా మీడియా వాళ్ళు. ఏ బాంబు పెలేదాక వాళ్ళ  వైఫల్యాలు ఎందుకు గుర్తించలేక పోతోంది ప్రభుత్వం ఇంకా మీడియా.. ఎన్ని స్కాములని రహస్య కెమెరాలతో చిత్రించి చూపించే మీడియా తీవ్రవాదులని ఎందుకు బందించలేక పోతోంది తమ రహస్య కెమెరాలలో?
 
ప్రాణాలకి తెగించి చెకింగ్ చేస్తున్న ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు అత్యాదునిక పరికరాలు లేవు దీని మీద ఎందుకు అసెంబ్లీ ఆపారు. ప్రాణం కన్నా ప్రాంతమో డాములో పెద్దవా?  పోలీసు బాగోగులు గురించి గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?  వారికి పెద్ద జీతాలు ఎలాగో ఇవ్వరు కనీసం వారికి ఆధునిక పరికరలిచ్చి అయినా సహకరించారా? అందుకే నాకు అనిపించింది "పాపం హైదరాబాదు పోలీసులు :( "

2010-05-04

వేచి ఉంటానే చెలి నీ కొరకు

నీ కోసం వేచిన నా కళ్ళు అలసినా
నీ ధ్యానంలో మరచిన నా జీవితం పిలిచినా
వేచి ఉంటానే చెలి నా తుదిస్వాస వరకు
వేచి ఉంటానే సఖి నా గొంతు మూగబోయే వరకు..

2010-04-28

ఈ వేసవి వేడి తట్టుకోలేకపోతున్నాం

నిన్న నేను కొంచెం ఆలస్యంగా  నిద్రలేవటం వాళ్ళ ఆఫీస్ కి వచ్చేసరికి 11 అయ్యింది. వచ్చేసరికి చొక్కా తడవటం ఎండటం కూడా అయ్యిపోయింది. నా చిన్నతనం అంతా దాదాపుగా విజయవాడ దగ్గరలో అవ్వటం వల్లనేమో వడదెబ్బ కొట్టకుండా తట్టుకున్నాను లేక పోతే ఈ ఎండకి నేను నిమ్స్ లో భర్తీ  అవ్వాల్సి వచ్చేది.

నాలుగు సంవత్సరాలు క్రితం నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఇలా వుండేది కాదు ఎంత ఎండ వున్నా   చెమట వచ్చేది కాదు. కాని ఈ మద్యన బాగా చెమట వస్తోంది. సరే నిన్న ఆఫీస్ లో పని వత్తిడి తక్కువ వుండటం వల్ల నా ఆలోచనలు ఎండమీదకి మళ్ళాయి. అసలు ఇంత ఎండలు రావటానికి కారణం ఏంటి అని ఆలోచించటం మొదలుపెట్టాను.

నా ఆలోచనలలో తెలిందేంటి అంటే  ఇంత ఎండ ఉండటానికి కారణం మనందరి స్వార్ధం...కేవలం మన స్వార్ధం మాత్రమే..దేవుడు మనకి బుర్రని ఇచ్చాడు అని మురిసిపోయే  మనిషి కి  దాని తో పాటు తనకి గంపెడు స్వార్ధం కూడా వుంది అని గుర్తించటానికి ఇష్టపడడు...

ఇంతకీ నేను చెప్పాలి అనుకున్నది  ఏంటంటే నేను ఒక గంట బుర్ర గోక్కుంటే నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ఈ వేడికి కారణం మనమే హైదరాబాదు వాసులం.. వున్నా అన్ని కొండలని బండాలని పగలకొట్టి...చెట్లన్నీ తెగనరికి బహుళ అంతస్తుల మేడలు కడతాము..వాటిని కొనటానికి మనం మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గాడిద చాకిరికి కూడా సిద్దమవుతాం(ఈ ఎం ఐ కట్టాలికదా )..ఇదంతా నేను తప్పు అనట్లేదు కాని ఇక్కడ ఒక చిన్న నష్టాన్ని మనం గుర్తించట్లేదు మనం ప్రకృతికి నష్టం చేస్తున్నాం కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయటం మన కనీస బాధ్యత అది మరచిపోతున్నాం..

దీనివల్ల మనం విపరీతమైన ఎండలు మాత్రమే కాదు మన భావితరాలను కూడా భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం.. చెట్లు లేక పోవటం వల్ల భూగర్భ జలాలు  ఇక్కడ ఉండట్లేదు దాని వల్ల మన మనకి నీటి ఎద్దడి ఏర్పడుతోంది ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి హైదరాబాదు మరో ఎడారిలాగా తయారు అవుతుంది.

ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం మనం పెద్ద పెద్ద తోటలు పెంచానవసరం లేదు. ప్రతి ఒకళ్ళు వారి ఇళ్ళలో ఒక చెట్టు నాటితే చాలు మళ్ళి నీటి ఎద్దడి విపరీతమైన ఎండలు ఉండనే ఉండవు..

కొన్ని సలహాలు:
1 . ఇండిపెండెంట్ ఇల్లు కలవారు మీ ఇంటి వాకిట్లో  కాని దొడ్లోకాని ఒక వేప చెట్టు పెంచండి దీని వల్ల మీకు చాలా లాబాలు వుంటాయి
లాభాలు:
     అ. వేపచెట్టు గాలి చాలా రోగాలను దూరం గా ఉంచుతుంది..దీని వల్ల మీకు ఆసుపత్రి బిల్లు ఆదా అవుతుంది
     ఆ. చల్ల గాలి వీస్తుంది విద్యుత్ కోత సమయం లో దీని కింద పడుకుంటే మీకు ఎ.సి దండగ అనిపిస్తుంది
     ఇ. వీప చెట్టుకు ఎన్నో మూలికా విలువలు వున్నాయి చాలా దెబ్బలని నయం చేయగల శక్తీ వుంది
     ఈ. ఇక ఉగాదికి మీరు వ్యాపారం పెట్టచ్చు అని నేను ప్రఎకంగా చెప్పకర్లేదు అనుకుంటా:)
     ఉ. పెద్దపెద్ద వేళ్ళు ఉండవు కాబట్టి పునాదులు పాడుఅవ్వవు
నష్టాలు:
     అ. ఊడవటం కష్టం గా వుంటుంది చాలా ఆకులు రాలుతుంటాయి

2 . అపార్టుమెంట్ కలవారు వారి సంఘానికి చెప్పి వేపచెట్లు నాటించవచ్చు.
౩.అద్దె ఇంటిలో వుండే వారు చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు వాటిని ఇల్లుమారే సమయంలో మార్చటం తేలికగా వుంటుంది.

ఈ చెట్లు పెంచటానికి మీరు పడాల్సిన శ్రమ పెద్దగ ఏమి వుండదు.. రోజు మీరు  ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఒక సారి దానికి నీరు పోస్తే సరిపోతుంది..చాలా వరకు వేపకి తెగులు రాదు కాని ఏమైనా వస్తే ఒక రోజు పురుగు మాడు కొట్టాలి అంతే...

మీరు చేసే ఈ చిన్న పని మీ పిల్లల భవిష్యత్తుని మార్చగలదు..నేను చెప్పను అని కాదు మీరే ఆలోచించుకోండి...మీరు మొక్కలు నాటతారు అని ఆశిస్తూ సెలవ్...

మీ నేస్తం

 


     

2010-03-03

"తారే జమీన్ పర్ "--ఒక తమాషా

చాల రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను నా స్నేహితులతో కలిసి "తారే జమీన్ పర్" సినిమాకి వెళ్దాము అనుకున్నాను. మా స్నేహితులలో ఒకడు తన ప్రియురాలికి(ఇప్పుడు పెళ్లి అయ్యిపోయిందిలెండి) ఆ సినిమాకి తనతో వెళ్తాను అని చెప్పాడు అని అన్నాడు. సరే పోయేది ఏముంది ఆ అమ్మాయికి ఇబ్బంది లేక పోతే మాతో రమ్మని చెప్పాము. ఆ అమ్మాయి ఒప్పుకోవటంతో మేము ఐదుగురం ఆ అమ్మాయి మొత్తం ఆరుగురంకలిసి ఆ సినిమాకి వెళ్ళాం. సినిమా చాలా బాగుంది. నేను వాళ్లిదరి పక్కన సీటులో కూర్చున్నా. సరే కొంచెం సినిమా అయ్యాక సినిమా లో పిల్లాడిని హాస్టల్లో వదిలేసి వాళ్ళ అమ్మానాన్న వెళ్ళే సీను, అందులో నటించిన పిల్లాడు చాలా బాగా చేసాడు ఆ సన్నివేశంలో. అందులో లీనమై చూస్తూ ఎందుకో పక్కకి తిరిగా. నాకు అక్కడ చూసిన సన్నివేశానికి నవ్వు ఆగలేదు. మా స్నేహితుడు,వాడి ప్రియురాలు ఇద్దరు ఆ సన్నివేశంలో లీనమైపోయి తెగ ఏడుస్తున్నారు. వీడు ఆ అమ్మాయి చున్నీ ఒక అంచుతో తుడుచుకుంటుంటే ఆ అమ్మాయి ఇంకొక అంచుతో తుడుచుకుంటోంది. అక్కడ నించి ఆ సినిమా అయ్యే దాక ఏ విషాద సన్నివేశం వచ్చిన తెర వంక చూడాలో వెళ్ళని చూడాలో అర్ధం కాక సగం సినిమా చూడలేదు. సినిమా నించి అందరు కళ్ళు ఎర్రబడి బయటకి వస్తుంటే నేను మాత్రం పొట్ట పట్టుకొని నవ్వు కుంటూ బయటకి రావాల్సి వచ్చింది . చివరికి రెండో సారి ఒక్కడిని వెళ్లి చూడాల్సి వచ్చింది.

2010-03-01

నా ఆటను చేడకోడుతూ వచ్చింది అది/ఆడు

ఒకానొక వాన కురిసిన రాత్రి వేడిగా పకోడీలు తింటూ కమ్మగా పాత పాటలు వింటూ నేను కంప్యుటరులో జి టి ఎ ఆడుతుండగా మా రూములో ఏదో చప్పుడు అయ్యింది. అసలే రూములో పని పాడు లేకుండా ఖాళీగా ఉండేవాడిని నేనే కాబట్టి ఆడుతున్న ఆటని మధ్యలో ఆపి ఏంటా అని రూములో వెతకటానికి పోయాను. అన్ని చోట్ల వెతికాక ఏమి కనిపించక పోయే సరికి ఇది వాడి/దాని  పనే అయ్యుంటుంది అని నిర్ణయించేసుకొని మళ్ళి నా చుట్టుపక్కల నిశితంగా వెతకటం మొదలుపెట్టాను.

అలా వాడు/దాని కోసం ఏంటో వెతకగా అలిసి సొలసి ఇంకా వెతక లేక హాలులో మంచం మీద కూలపడిపోయాను. వాడిని/దానిని చంపేయాలి కాని ఎలాగా అని ఆలోచిస్తుండగా. మళ్ళి దాని/వాడి అరుపు నాకు చాలా దగ్గరలో వినిపించింది. ఆ అరుపుకి మళ్ళి నా వెతుకులాట మొదలుపెట్టి.సరిగ్గా నేను కూర్చున్న మంచం  కింద పెట్టిన బూట్లలోనుంచి మళ్ళి అరుపు వచ్చింది. ఈ సారి నా కోపం బి పి మీటరుకి కూడా దొరకకుండా పెరిగిపోయింది. వెంటనే దానిని చంపటానికి కర్రతీసుకువచ్చాను.

నేను కర్ర తీసుకొని సిక్స్ కొట్టే  సచినులాగా గోలు కొట్టే ధనరాజ్ పిళ్ళై లాగా రెడీ అయ్యి బూటుని కర్రతో కొంచెం కదిపాను. ఆ కుదుపుకి మెల్లమెల్లగా బయటకి వచ్చింది/వచ్చాడు. "మియ్య్యావ్వ్వ్ మియ్యావ్వ్వ్" అని అరుచుకుంటూ ఈ మధ్యనే మా వీధిపిల్లికి పుట్టిన పిల్లిపిల్ల. మూసినా కళ్ళని నెమ్మదిగా చిట్లిస్తూ తెరుస్తోంది. దానిని అలా చూసేసరికి నా చంపాలన్న కోరికని చచ్చిపోయింది. వెంటనే దగ్గరకి తీసుకోవాలి అనిపించింది కాని మళ్ళి ఇల్లుఅలవాటు అయితే ఇబ్బంది అని భయం వేసి దానిని నెమ్మదిగా తరిమేసాను.


గమనిక: ఆ పిల్లి పిల్ల ఆడదో మగదో తెలియక అది/ఆడు అని వాడాను. మీకు నచ్చిన జాతికి చెందినదిగా భావించి  చదవగలరు  

2010-02-22

నా కవిత--ఏమి తెలుసు ప్రేమ గురించి?

ఎల్లలు లేని అలలకేమి తెలుసు స్వాతంత్రం గురించి
ఎగర లేని గువ్వకేమి తెలుసు ఆకాశం గురించి
ఎండలు లేని గడ్దకేమి తెలుసు వడగాలి గురించి
మనసు లేని మనిషి కేమి తెలుసు ప్రేమ గురించి

2010-02-19

లీడర్- నా ఆలోచనలు

పేరుని చూసి నేను రానా నటించిన చిత్రం గురించి మాట్లాడుతున్నాను అని పొరబడద్దు. నా బ్లాగు పేరుకి న్యాయం చేద్దాము అని లీడర్ అన్న వాడి మీద నా ఆలోచనలని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.

అసలు లీడర్ అంటె ఏంటి అని ప్రశ్నించుకుంటే నాకు వచ్చిన జవాబు "నలుగురిని తన వాళ్ళుగా అనుకొని వాళ్ళు పైకి రావటానికి అహర్నిశలు కష్టపడే వాదె లీడర్" అని నాకు అనిపించింది.

ఈ లెక్కన చూస్తే మా నాన్న పెద్ద లీడర్ ఎందుకు అంటే ఇప్పటికి కూడా మా నలుగురి కోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ మనం మాట్లాడుకోవాల్సినది ఈ లీడర్ గురించి కాదు. సంఘాన్ని  తనది గా భావించి సంఘం అభివృద్ధి చెందటానికి అహర్నిశలు శ్రమించేవారి గురించి.

అందరికి వరకట్నం దురాచారం అని తెలుసు కానీ దానిని ఆపటానికి ప్రయత్నించే వాళ్ళు కొందరే. నేను ఉండే హైదరాబాదు నగరం లో ప్రతీ పదిమందిలో ఏడుగురన్నా పది దాకా చదివుంటారు అని నా నమ్మకం. ఐనా నేను చూసే పది వాహనాల్లో కనీసం మూడు కూడా నిభంధనలని సరిగా పాటించరు. అందరూ చదివిన వాళ్ళే కాని వాళ్ళకి నిభంధనలని పాటించాలి అన్న బుద్ధి ఉండదు ఎందుకు?

చాలా రోజులు పైన ప్రశ్న నన్ను వేధించింది. ఈ మధ్యనే నాకు దాని సమాధానం తెలిసింది.ప్రజలందరూ బావిలో కప్పలాంటి వాళ్ళు వాళ్ళ కి కనిపించే గోడని దాటి వెళ్ళరు. నేను కూడా అలాంటి ఒక కప్పనే అని నాకు అనిపించినప్పుడల్లా చాలా బాధగా వుంటుంది. సరే అని దీనికి పరిష్కారం వెతకటం మొదలుపెట్టా. అదే సమయం లో లీడర్ చిత్రం చిత్రీకరణని తెలంగాణా కార్యకర్తలు ఆపేశారు అని రానా తో "జై తెలంగాణా" చెప్పించి వదిలేశారూ అని వార్తలు వచ్చాయి . చిత్రీకరణ ఆపారు బాగుంది వాళ్ళ పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాని ఆ తర్వాత "జై తెలంగాణా" చెప్పించటం వల్ల వచ్చిన లాభం తెలియట్లేదు. ఈ సంఘటన తర్వాత నాకు ఒకటి బాగా తెలిసింది. ఆ సెట్స్ మీద దాడి చేసిన మందకి సరైన నాయకుడు లేడని. దానితో పాటు మనం ఇలా బావిలో కప్పల్లా ఉండటానికి కారణం కూడా  సరైన నాయకుడు లేకనే. సరైన నాయకుడే వుంది వుంటే మనం బావిలోనే వుండేవాళ్ళం కాదు.

ఏ పోరాటానికి అయినా నాయకుడు చాలా ముఖ్యం.నాయకుడు లేని ప్రయాణం చుక్కాని లేని పడవ లాంటిది. నేను నాలో నాయకుడు ఉన్నదేమో అని చూసుకున్నాను కాని నాకు నాయకత్వపు లక్షణాలు లేవని నాకు అర్ధం అయ్యాయి. మనకి ఇప్పుడు వున్నా రాజకీయనాయకులు గాని కార్మిక నాయకులు గాని ఎవరికి నాయకత్వం మీద పూర్తి అవగాహన లేదు అనేలా ప్రవర్తిస్తున్నారు. వాళ్లకి అంట అవగాహనా వున్నా దానిని దాచేస్తున్నారు. ఒక వేళ వున్నా దానిని తోక్కిపెడుతున్నారు. స్వల్ప లాభాలకి స్వలాభాలకి  మోసపోతున్నారు.

మన రాష్ట్రానికి దేశానికీ ఒక చక్కని నాయకుడి అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాని మనకి అలాంటి నాయకుడు రాలేదు.  ఎందుకు అంటే మనలోని నాయకత్వపు లక్షణాలని చిన్నప్పుడే చంపేస్తారు చదువులకి బానిసగా చేసి. కొంచెం ప్రపంచం తెలిసి మళ్ళి మనలో నాయకత్వపు లక్షణాలు పెరిగే సమయం లో సంఘం  కట్టుబాట్లు అని మళ్ళి చంపేస్తారు. తర్వాత ఆ నిర్లిప్తత అలా మనసులో ఉండిపోతుంది. దయచేసి అలాంటి వాళ్ళు ఆ నిర్లిప్తత వదిలి పోరాడండి.తల్లితండ్రులు కూడా తమ పిల్లలని రాజకీయాలకి ప్రోత్సహించండి. చక్కని పెంపకం లో పెరిగే నాయకుడు చక్కగా రాష్ట్రాన్ని నడపగలడు.

చివరిగా నాకు అర్ధం అయ్యింది ఏంటంటే మన దేశం లో నాయకుల కొరత లేనేలేదు కాని నాయకుడిని గుర్తించే ఊపిక తీరిక పెద్దలకి ఉండట్లేదు లేక వాళ్ళు గుర్తించినా వాళ్ళని రాజకీయానికి పంపట్లేదు.భయం వల్లనో మరే ఇతర కారణం వల్లనో  వాళ్ళని తల్లితండ్రులు నాయకులలోని నాయకత్వపు లక్షణాలని చంపేస్తున్నారు. అందుకే మనం ఇలానే ఉంటున్నాం. మనం(జనం ) కూడా ఒక మంచి కారణానికి పోరాటం చేస్తుంటే కానీస బాధ్యతగా సహకరించము. గుడ్డిగా ఎవడో తలక మాసిన రాజకీయనాయకుడు సమ్మెలు ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి సహకరిస్తాము ఎందుకు అంటే వాడికి బలం వుంది బలగం వుంది అన్న భయం. అందరు దానినుంచి బయటకి రావాలి మన దేశం లో కూడా  మళ్ళి మంచి నాయకులు రావాలి అని ఆశిస్తూ ముగిస్తున్నాను


ఈ టపాలో మిమ్మల్ని బాగా విసిగించి వుంటే క్షమించండి

జైహింద్

2010-02-09

సుబ్బారావు vs సుబ్బలక్ష్మి--ఆపేస్తున్నాను

కొన్ని అనివార్య కారణాల వల్ల నా కధ "సుబ్బారావు vs సుబ్బలక్ష్మి" రాయటం నిలిపివేయవలసివచ్చింది.  దయ చేసి క్షమించగలరు