2009-11-19

నేను.... నా క్లయింటు.... నా పాట్లు

సమయం: సాయంత్రం 6:15
ప్రదేశం: మా కారాగారం శిఖరాగ్రం  (ఆఫీసు పైన ఉన్న ఖాళీ ప్రదేశం)

అప్పటి దాకా మా ఆఫీసువాళ్ళు పెట్టే ఫలహారం తినేసి ప్రశాంతంగా  నాగర్జునా ఢాన్సులాగా పడాదామా వద్దా అని వాన ఆలోచిస్తుండగా హాయిగా ప్రకృతి ని ఆస్వాదిస్తున్నాను. ఇంతలో నా సెల్లు నా పరవశానికి భంగం కలిగిస్తూ నా కాలు గడగడ లాడించింది (నిశబ్దంలో పెట్టాను ) ఏ వెధవ సొల్లు చెప్పటానికి చేసాడా అని చిరాగ్గా దాని వంక చూసాను. "వారపు పని చిట్టా" (వీక్లి స్టేటస్ రిపొర్ట్ ) చెప్పటానికి సమయమయ్యింది అని నా సెల్లు గంట మొగించి చెప్తొంది.

నాకు ఎక్కడ లేని బాధ ఇంకా వెంటనే పాకిస్తానుకి కాని తాలిబాను కి గాని వెళ్ళి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక "ఆత్మాహుతి దళ" యెధుడిని తెచ్చి మా క్లయింట్ మీదకి వదలాలి అన్నంత కోపం వచ్చింది. కానీ వాడి ఉప్పు తింటున్నాను అని గుర్తొచ్చి నా మనసుని, దాంట్లో  కోపాన్ని "గొద్రేజ్" బీరువాలో దాచేసి "స్వాతిముత్యం" కమల్ హాసన్ నవ్వు ఒకటి మొహాన పులుముకొని "సమావేశపు గదికి"(కాన్ఫరెన్స్ రూమూ) వచ్చాను. అక్కడ పొరాటానికి సిద్దమవుతున్న సైనికుడు తన అస్త్రాలు సరిచూసుకుంటునట్టు మా లీడు "లాపుటాపు" సర్దుతున్నాడు.

ఈ రోజు ఎంతసేపు బుర్ర తింటాడో అని గుండెల్లో భయంగా వున్నా పైకి మాత్రం అందరితో సరదాగా మాట్లాడుతున్నా. ఇంతలో ఆ శుభగడియలు రానే వచ్చాయి. మా లీడు ఫొను కలిపాడు కాసేపు అర్ధం కాని భాషలో అమ్మనాబూతులు తిట్టించుకున్నాక కొన్ని మీటలు నొక్కితే మా క్లయింటు లైనులోకి వచ్చాడు.          

వస్తూవస్తూనే సుడిగాలిని తలపిస్తూ "HOWDY.. HOWDY..." ఒక అరుపు అరిచాడు

దానికి అర్ధం ఏంటో తెలియకపోయినా పూర్వానుభవం వల్ల వాడు మేము ఎలా వున్నామో అని అడుగుతున్నడు అని అర్ధం చేసుకున్నాము. "బాగానే ఉన్నాము" అని ఆంగ్లంలో చెప్పాము. కానీ మనసులో మాత్రం "మా ఖర్మ కొద్ది నీ దగ్గర పడ్డాము" అని అనుకున్నాను

ఎంతైనా భారతీయులం మన సంస్కారమెలా మర్చిపోతామని "HOW R U *****" అని అడిగాము. దానికి వాడు "SUPERB" అన్నాడు. వెంటనే మాకు మూడింది అని రాత్రికి నిశాచరులని కలవక తప్పదని అర్ధమైపోయింది

జరగాల్సిన నష్టం ఎటూ జరిగిపొయింది ఇంకా నష్టం జరగకుండా చూడాలి అని వెంటనే నష్టనివారణ  చర్యలు మొదలుపెట్టము. వాడికి అవకాశం ఇస్తే ఎక్కడ సొల్లు మొదలు పెడతాడో అని తుపాకి పేల్చగానే పరిగెత్తే ఉసియన్ బోల్ట్ లాగా మా మా లీడు "SHALL WE START WITH PLAN FOR CALL *****" అని అన్నాడు.

క్ల: "SURE........."

వెంటనే మొదటి దశలో సొల్లు తగ్గించిన మా లీడులో నాకు ముక్కొటి దేవతలు మూకుమ్మడిగా కనిపించారు. కాని మనసులో ఏదో మూల పొద్దునే స్కూలుకెళ్ళే పిల్లాడి లాగా నేను నా భుజాన ల్యాపుటాపు సంచి తగిలించుకొని సాయంత్రం 9:00 కి చూడబొయే 2012 ని తలుచుకుంటూ వస్తుండగా పక్కింటాళ్ళ పిచ్చి కుక్క ఎదురింటాళ్ళ నల్ల పిల్లి కలిసి సరదాగా వాకింగు చేస్తూ నాకు ఎదురు వచ్చాయే అయినా వీడు సొల్లు మొదలెట్టలేదు అని ఆనందిస్తుండగా

క్ల: "BUT I WANT US TO DO A SHORT BRAINSTROMING TODAY AFTER UR POINTS........." అన్నాడు

వెంటనే నా ఆత్మారాముడు నిద్రలేచి "ఛీ వెధవా!! జల్సా లో సునీలు లాగ నీకు ఏది సరిగ్గావినే అలవాటు లేదు... నీ ఆత్మారాముడిగా నీ బాధలు భరించలేక పొతున్నా అని నోటికొచ్చినవి కొన్ని రానివి కొన్ని తిట్టేసాడు"

వీడి తిట్ల కంటే మా క్లయింటు తిట్లే మేలు వాడు ఏమి తిట్టినా సగం అర్ధం కావని నా ఆత్మారాముడికి జో కొట్టి వాడి మాటల మీద దృష్టి పెట్టాను.

మా లీడు ఆరంభశూరత్వాన్ని కొనసాగిస్తూ మేమూ ఈ వారము చేసిన పనులన్ని వాడికి ఏకరువు పెట్టుకుంటున్నాడు. సరే ఈ సునామి త్వరలో నా మీదకి వస్తుంది అని బ్యాటింగ్ కి వచ్చేముందు వ్యాయామాలు చేసి దిగినట్టు ఒక్క సారి నేను ఈ వారం చేసినవన్నీ నేమరువేసుకుంటున్నా.. ఈలోగా నా వంతు వచ్చేసింది. నేను అనుకున్నవన్నీ చిన్నప్పుడు పాఠాలు అప్పచెప్పిన అనుభవంకొద్ది గడగడ అప్పచేప్పేసా.

"WELL...I APPRECIATE YOU EFFORTS BUT CAN YOU REPEAT IT ONCE AGAIN" అన్నాడు వాడు.

అరకిలోమీటరు పరిగెత్తి అక్తర్ బంతి విసిరితే అంగుళం కూడా కదలకుండా బంతిని ఆపిన ద్రావిడ్ మీద అక్తర్ కి ఎందుకు కోపం వచ్చిందో నాకు  అప్పుడు అర్ధం అయ్యింది. చేసేది లేక నేను నా పాఠం నెమ్మదిగా అప్పచేప్పాను.

"GREAT!!!.." అన్నాడు వాడు

హమయ్య!!! ఈ రోజుకి బ్రతికి పోయాను అని అనుకున్నా మనసులో. మిగితా వాళ్ళ పాఠం వింటుండగా నాకు కాస్త కునుకు పట్టింది. నిద్రపోతుంటే కలలో మా క్లయింటు అరుంధతి లో అఘోరా వేషం వేసుకొని నా బుర్రని సాయంత్రం తిన్న దోసతో నంచుకుతింటున్నాడు. "అయ్య బాబోయ్" అని టక్కున లేచి చూసాను.

మా క్లయింటు అప్పుడే వాడి కాఫీ తెచ్చుకొని మమ్మల్ని ఊరించే ప్రయత్నమో లేక సహజ తత్త్వమో తెలియదు కాని "బొమ్మరిల్లు" హాసిని లాగా గట్టిగా జుర్రుకుంటూ తాగుతున్నాడు. నాకు తిన్న అల్పాహారం అరిగిపోయి కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి.  "నీ కాఫీలో కందిరీగ కూలా అని" మనసులో అనుకుంటూ దీనంగా గడియారం వంక చూసాను. అప్పటికే చిన్న ముల్లు ౩౦ డిగ్రీలు తిరిగేసింది(గంట గడిచింది అని నా కపిహృదయం ) ఇంకా వదలట్లేదు.

అప్పటికే అందరు ఏమి చేసారో ఏమి చేయబోతున్నారో చెప్పేశారు ఇంకా వెళ్ళచ్చు అనుకుంటుండగా "OK now lets start brainstroming on %^*(@@^&!&!**@^@#%#^&"  ఐదు నిముషాలు ఊదరగొట్టి "LETS SHARE OUR VIEWS" అన్నాడు .

మనకి ఇచ్చిన అంశం మీద అవగాహన వున్నా లేకున్నా మాట్లాడటం "గుంపు సంభాషణలలో"(గ్రూపు డిస్కషన్) అలవాటే కాబట్టి ఉత్సాహం ఆపుకోలేక "IN MY VIEW....." అని ఏదో వాగేశా. 

"YEAH THATS AN EXCELLENT THOUGHT BUT HOW CAN THIS FIT....." అంటూ దొరికారురా ఇంకా నాకు "నిన్ను వదల బొమ్మలి వదలా" అని వాడి స్టైల్ లో వాడు బుర్రలో  గుజ్జు తాగే కార్యక్రమంలో మునిగిపోయాడు.

పొద్దున్న కనిపించిన పిల్లి కుక్క గుర్తొచ్చి ఇంకో ఇద్దరు యోధుల్ని కూడా కొనాలి వాటికోసం అని అనుకుంటూ చుట్టూ చూసాను. అందరు  నా వంక వాడి మానన వాడు ఏదో  చెప్తుంటే ఎందుకురా నువ్వు మధ్యలో మాట్లాడవు (మరీ ఇంత సాత్వికం గా కాదు కాని అన్ని రాస్తే బాగోదు అని రాయట్లేదు) అనట్టు చూస్తున్నారు.

ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా సరే సమరసింహారెడ్డి సినిమా లాగా  నన్ను చంపటానికి ఎక్కడ స్కుటీలు, పాషను ప్లస్సులు వేసుకొని ఎక్కడ తరుముతారో  అని భయం వేసి మా లీడు వంక "అన్యదా శరణం నాస్తి" అనట్టు చూసాను.

దానికి మా లీడు నాకు పాంటు షర్టు వేసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా వంక భయపడకు అని చెప్పి
"ACTUALLY ***** the intention was like #!$$%%@^&!*!" అని ఏదో  సర్ది చెప్పాడు.

అలాగా చిన్న ముల్లు ఇంకో  30 డిగ్రీలు తిరిగే దాకా వాడు బుర్ర తిని వదిలితే చావు తప్పి కన్నులోట్టపోయింది లే ఫర్వాలేదు అనుకుంటూ సినీమా కి పరుగులు తీశాను.

ఇదండీ  మా క్లయింటుతో   నేను పడ్డ పాట్లలో ఒకటి.

                    

2009-11-13

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

బుడి బుడి అడుగులు ముద్దుముద్దు మాటలు
గాడిద బరువులు చదువుల బాధలు
కొతికొమచ్చి ఆటలు బాటు కోసం ఫైట్లు
స్నేహితుల ముచ్చట్లు పరీక్షల అగచాట్లు

ఒంటిపూట బడులు వణికించే పంతుళ్ళు
వేసవి సెలవలు ఊళ్ళొ పోలాలు
కక్కిన పెన్నులు చిరిగిన బ్యాగులు
ఇవేలే కళ్ళలో మెదిలే బాల్యస్మృతులు

2009-11-11

ఏక్ నిరంజన్ పారడి

హైకూ లేదు గిఫ్తు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేళకి ఇంటికి వెళ్లే యోగం లేదు ఏక్ నిరంజన్...
జావా రాదు... నాకు జే.స్.పి రాదు.
.నెట్ రాదు నాకు సీ# రాదు
ప్రోగ్రామింగ్ రానే రాదు,అప్రిసియేషన్ లేవులే,
ఆన్‌సైట్ చాన్సే లేదు,ప్రమోషన్ లేదులే.
సర్చింగ్ లో కింగ్ నే , నా లోకమే గూగులే..
వర్కున్నా, లేకున్నా నేనెప్పుడూ ఎహె కాంటీన్‌లో ఉంటానే..
హైకూ లేదు గిఫ్తు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేళకి ఇంటికి వెళ్లే యోగం లేదు ఏక్ నిరంజన్...
కేర్ ఆఫ్ క్యాంటీన్, ప్రాడక్ట్ అఫ్ బెంచ్ అవారా డాట్ కామ్.
ఏ ధమ్లో ధమ్ టన్స్ ఆఫ్ కాఫీ మనకదే గా ప్రాబ్లమ్.
అరె ప్రాజెక్ట్ పేరే తెలియదే, నాకు కోడింగ్ ఏ రాదే.
ఏ టి . ఎల్ , లీడు లేరులే.. న మెయిల్స్ ఏవో నావే...
వాచ్చావా చేశావా అని అడిగేదియేవ్వడులే. .
ఔటింగ్లు పార్తీలు అని పిలిచేవాడు ఎవ్వడే. .
సర్చింగ్ లో కింగ్ నే , నా లోకమే గూగులే..
వర్కున్నా, లేకున్నా నేనెప్పుడూఎహె కాంటీన్‌లో ఉంటానే..

హెడ్ ఇస్ ఏకింగ్,అండ్ ఇట్స్ బ్రేకింగ్ ఖాళి ఐతే అంతే,
దాట్స్ ఒకే యార్ ఛల్తా హై, ఐ హ్యావ్ ఏ శారిడాన్..
ఓ పనికి మలిన ప్రాజెక్ట్స్ కాల్స్ చేస్తాయి లే..
మన స్టైల్ లో మనమే రిజెక్ట్ చేస్తామే.

ఇవ్వాళో రేపో లా మన బ్రతుకు ఉందే..
తీసేస్తే ఇంకో కంపనీ ఉండనే ఉందే...
సర్చింగ్ లో కింగ్ నే , నా లోకమే గూగులే..
వర్కున్నా, లేకున్నా నేనెప్పుడూఎహె కాంటీన్‌లో ఉంటానే..
హైకూ లేదు గిఫ్తు లేదు పండక్కి ఇచ్చే బోనస్ లేదు ఏక్ నిరంజన్..
లక్కు లేదు కిక్కు లేదు వేళకి ఇంటికి వెళ్లే యోగం లేదు ఏక్ నిరంజన్...
గమనిక: ఇది నేను రాసింది కాదు నాకు ఎవరో పంపితే బాగుందని నా బ్లాగు లో రాశాను

2009-11-04

సుబ్బిగాడు vs సుబ్బలక్ష్మి -3

అలా సుబ్బిగాడు పెళ్లి చెడగొట్టుకోటానికి... సుబ్బలక్ష్మి ఎలాగన్నా ఈ పెళ్లి ఖాయము చేసుకోవాలి అని... రకరకాలుగా కృషి చేస్తున్నారు. ఈ ఆలోచనల మధ్యన పొద్దునే లేచి బ్యుటీ పార్లర్కి వెళ్ళి అందంగా తయారయ్యి పెళ్ళిచూపులకి సమయం మించి పోతోంది అని సుబ్బలక్ష్మి వేగంగా ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో మన సుబ్బిగాడు అందంగా తయారయ్యి తన బైక్ వేసుకొని వేగంగా వస్తున్నాడు. మరుసటి రోజు పండుగ వల్లో లేక ఇంట్లో పెళ్ళాం తరిమేయటం వల్లనో కానీ మన సుబ్బిగాడి దశ బాగోక అదే సమయానికి అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబులు జంక్షను దగ్గర నిల్చోని బైక్‌లు ఆపుతూ మామూలు వసూలుచేస్తున్నాడు. మన సుబ్బిగాడు పెళ్ళిచూపులకి వెళ్తున్నాను అక్కడ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో?? తనని వద్దని ఏవంక పెట్టాలో?? అన్న ఆలోచనలలో పడి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ని గుర్తించలేదు. అలా తన ఆలోచనలలో ఉండిపోయి రోడ్డుకి అడ్డంగా నిల్చుని మామూలు వసూల్చేస్తున్న కానిస్టేబుల్ని గుద్దెశాడు .


గుద్డాక సుబ్బారావు ఊహాలోకంనించి తేరుకొని జరిగింది ఏమిటా? అని ఒక సెకను ఆలోచించు "అయ్యా బాబోయ్!!!!" అని గావుకేక పెట్టాడు. ఆ కేక కి కింద పడ్డ కానిస్టేబుల్ కి ఏమైందో అని భయం వేసి నేలకి కరుచుకొని పోయాడు. ఇద్దరిలో మొదట తేరుకున్న సుబ్బారావ్ ఇంకా అక్కడే ఉంటే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని గ్రహించి తన బైకుని వాయువేగంతో ముందుకి ఉరికించాడు. అక్కడికి కొంచెం దూరంలో హడావిడిగా ఇంటికి వస్తున్న సుబ్బలక్ష్మి ఈ సంఘటనంతా చూస్తూనే ఉన్నది. "ఫర్వాలేదు..గురుడు ముదురే" అని మనసులో అనుకోని నవ్వుకుంటూ ఇంటికి వెళ్దాము అనుకుంటుండగా తనకి ఒక్క ఆలోచన వచ్చింది అనుకున్నదే తడవుగా ఆచరించటం మొదలు సుబ్బారావు ఎంతో దూరం వెళ్లలేదు ఆ సందుచీవరనే ఇంటి అడ్రెస్ తెలియక ఎవరిని అడగాలా అని చుట్టుచూస్తున్నాడు. ఇంత పొద్దున ఎవరు రోడ్డుమీదకు వస్తారు ఏమీ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సుబ్బారావు.


"దేని కోసం అన్న వెతుకుతున్నారా" అంటూ అడిగింది సుబ్బారావుని.


అప్పటికే గాలి ఆడని ఆస్త్మా పేషెంట్లాగా కొట్టుకుంటున్న సుబ్బారావు కి సుబ్బలక్ష్మి ముఖానికి గుడ్డ కట్టుకున్న అదృష్టదేవతలాగా అనిపించింది. సుబ్బలక్ష్మి చలికి జలుబు చేయకుండా ముఖానికి గుడ్డ కట్టుకుంది. కేవలం తన కళ్ళు మాత్రమే బయటకి ఉండేట్టు ముఖానికి చున్ని కట్టెసుకుంది.


"ఇక్కడ వామనరావుగారి ఇల్లు మీకు తెలుసా?" అని అడుగుతూ గతరాత్రి తీసిన అడ్రెస్ ప్రింట్ అవుట్ ఆమె చేతిలో పెట్టాడు.


ఒక రెండు నిముషాలు మనసులో తాను చేసే పని తలుచుకొని నవ్వుకుంటూ "ఓ ఆయన ఇల్లా మీరు తప్పు సందు తిరిగారు. మీరు ఇందాక ఒక చౌరస్తా దాటి వచ్చారు కదా దాని దగ్గర కుడివైపుకి తిరగండి..." అంటూ తన ఇంటికి రావటానికి ఇంకో దోవ చెప్పింది. మామూలుగా వాళ్ల ఇంటికి వెళ్ళాలి అంటే ఒక 200 అడుగులు ముందుకి వెళ్తే సరిపోతుంది.


సుబ్బారావుకి చౌరస్తా అని చెప్పగానే ముందుగా తాను గుద్ది వచ్చిన కానిస్టేబులు గుర్తువచ్చి టక్కున "ఇంకో దోవ ఏమీ లేదా" అని నీరసంగా అడిగాడు.


సుబ్బలక్ష్మి తనలో తాను నవ్వుకుంటూ ఉంది కానీ దానికి మీరు మా ఇంటికి ఒక సారి రావాలి అని అన్నది. ఆ అమ్మాయి ఇంటికి తన అడ్రెస్ కి సంబంధం ఏంటో తెలియక వెర్రి చూపులు చూస్తుండగా అతని అవస్థ అర్ధం చేసుకున్న సుబ్బలక్ష్మి"భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ కిడ్నాప్చేయను ఆ ఇంట్లో నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి ఉంటుంది ఈ రోజు దాని పెళ్లి చూపులు నన్ను కూడా రమ్మంది మీరు అటే వెళ్తాను అంటున్నారు కాబట్టి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యీ మీతో పాటు వస్తాను మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నది.


సుబ్బారావుకి ఏమీ చేయాలో ఏమీ చెప్పాలో తోచలేదు. ఎదురుగా అమ్మాయి తనతో వస్తాను అంటోంది. అక్కడ వెళ్లేది పెళ్ళిచూపులకి అమ్మాయితో వెళ్తే ఏమీ అనుకుంటారో? అని అనుకుంటూ "సరే పదండి" అంటూ ఆమె బండి వెనకాలే వెళ్లాడు.


"అవును మీకు ఆ ఇంటితో పని ఏంటి??" అని అడిగింది సుబ్బలక్ష్మి.


"అది నేను మీ ఫ్రెండ్ ని చూడటానికి వెళ్తున్నాను" అని చెప్పి సుబ్బలక్ష్మి రియాక్షన్ కోసం ఆమె వంక చూసాడు సుబ్బారావు


"ఓ సుబ్బులుని చేసుకోబోయేది మీరేనా..." అంటూ నవ్వేసింది


"చేసుకోబోయేది" అన్న మాట వినగానే సుబ్బారావుకి పిడుగు పడట్టు అయ్యింది "అదేంటి అలగానేశారు నేను జస్ట్ చూడటానికే వెళ్తున్నది " అని అన్నాడు.


"అంటే మా సుబ్బులుకి మీరు ఆల్‌రెడీ తెగ నచ్చేశారంట అది మిమ్మల్నే చేసుకోవాలి అననుకుంటోంది" అని చెప్పింది సుబ్బలక్ష్మి


"ఆమెకి నచ్చితే చాలా నాకు నచ్చాకర్లేదా??" అని కోపముగా అన్నాడు


"అరే అలా అని కాదు ఏదో దానికి నచ్చారు కదా అని " అని ఏదో అనబోతుంటే.


"తనకి నచ్చినా నచ్చక పోయినా నేను ఒప్పుకునేది లేదు" అని ఖరాఖండిగా చెప్పేసాడు సుబ్బిగాడు.


"అదేంటి అంత మాట అనేశారు చూడకుండానే" అని షాక్ లో బండి ఆపేసింది సుబ్బులు


సు. రా: "ఏంటి అంటే నా ఇబ్బందులు నాకు ఉన్నాయి"


సు. ల: "మరి మీరు పెళ్లి చూపులకి ఎందుకు వస్తున్నారు"
సు.రా: "అది ఒక పెద్ద కధలెండి ఇప్పుడు మీకు చెప్పెంత టైంలేదు పైగా మీకు నేను ఎందుకు చెప్పాలి?"

సు.ల: "పర్వాలేదు చెప్పండి నేను కావాలి అంటే మా సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి పెళ్ళిచూపులు లేట్ అవుతాయి మీరు నాతోనే ఉన్నారు అని చెప్తాను"

సు.రా: "అసలు మీరు నాకు ఇప్పుడే పరిచయం మీకు నేను ఎందుకు చెప్పాలండి"

సు.ల: "మీరు నాకు అది చెప్తే నెను మీకు సుబ్బలక్ష్మి గురించి చాలా పెద్ద సిక్రెట్ చెప్తాను"

వెంటనే సుబ్బారావు "ఇదేదో బాగనే వుందే నా ఇబ్బంది చెప్తే నాకు వచ్చే నష్టం ఏమి లేదు కాని తన గురించి నాకు ఎంత తెలిస్తే వద్దనటానికి అంత సులభం అవుతుంది" అని మనసులో అనుకోబోయి కొంచెం గట్టిగానే అనేసాడు.

"పడ్డాడు మన వలలో పడ్డాడు" అనుకుంది సుబ్బలక్ష్మి

సు.రా: "సరే మీరు మాట మీద నిలబడాలి" అన్నడు

సు.ల: "తప్పకుండా" అన్నది

ఆ ఇబ్బంది ఏంటో త్వరలో మీ ముందుకి తెస్తాను అప్పటి వరకు సెలవు..:)

2009-10-26

సుబ్బిగాడు vs సుబ్బలక్ష్మి -2

వన్...టూ...త్రీ...జంప్..
వన్...టూ...త్రీ...జంప్..
వన్...టూ...త్రీ...జంప్..

మొఖం అంతా ముచ్చెమటలు వేసుకున్న టి-షర్ట్,ట్రాక్ పాంట్ అప్పటికే తడిసి ఆరి మళ్ళి తడవటానికి తయారుగా ఉన్నాయి. అయినా పట్టు వదలక కృషి చేస్తోంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి.. పేరు పాతది అయినా ఈ కాలం పిల్లకి వుండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి ఒక్క సైజ్ జీరోతప్ప. సుబ్బలక్ష్మికి అన్ని మంచి గుణాలే కాని ఎందుకో తెలియదు కానీ సుబ్బలక్ష్మికి శరీరానికి ఊబకాయం వచ్చింది.

సుబ్బలక్ష్మి మొహం చాలా కళగా అందంగా ఉంటుంది కానీ శరీరం మాత్రం ఆ మొహానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. డాక్టర్లకి చూపిస్తే ఎవరికీ ఈ వింత పరిణామానికి కారణం దొరకలేదు. అయినా సరే తమవంతు ప్రయత్నం చేస్తాము అని చెప్పి కొందరు డాక్టర్లు చాలా మందులు ఇచ్చారు వాటి వల్ల కలిగిన దుష్ప్రభావం వల్ల అప్పటి దాకా ఆరోగ్యంగా వుండే సుబ్బలక్ష్మి ఆరోగ్యం చెడిపొయింది. ఇంకా తండ్రిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేని సుబ్బలక్ష్మి ఇంకా ఏ డాక్టర్నీ కలవను అని మొండిగావుండి పొయింది. అప్పటికి ఆమె వయసు 12 సంవత్సరాలు.

ఇప్పుడు ఎంత లేదన్నా ఒక 95 కిలోల బరువు ఉండే సుబ్బలక్ష్మి పెళ్ళి బరువు మొయలేక తండ్రి వామనరావు ఇప్పటికి ఎక్కని బ్యూరో గడప లేదు కలవని పెళ్ళిళ్ళ పేరయ్య లేడు. మమూలుగా పుచ్చుకునేదానికి పదింతలు ఎక్కువ తీసుకొని ఒక పది సంబంధాలు చూపించాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్య. అందరికీ సుబ్బలక్ష్మి క్లోజ్-అప్ లో తీసిన ఫోటోలు చూపించారు తీరా పెళ్ళి చూపులలో పిల్లని చూసి అందరూ వద్దని నచ్చలేదు అని చెప్పేసారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక చాలా బాధపడిన సుబ్బలక్ష్మి తండ్రిని ఒక సంవత్సరం పెళ్ళికి ఆగమని చెప్పి నగరంలో వున్న అన్ని బ్యూటీ పార్లర్లు , ఫిట్ నెస్ సెంటర్లు తిరిగింది కానీ పెద్ద ప్రయొజనం లేక పోయింది.

ఈ ఒక్క ఇబ్బంది తప్పించి సుబ్బలక్ష్మికి అన్ని బాగానే వున్నయి. ఇంజినీరింగ్లో యునివర్సిటీ ఫస్ట్. ఒక పెద్ద సాప్ట్ వేరు కంపేనీ లో మానవవనరుల శాఖ( హెచ్. ఆర్) లో పని చేస్తోంది. జీతం నెలకి 50 వేలు. తండ్రికి చాలా ఆస్తివున్న ఇంట్లో మూడు కార్లు ఉన్నా తన సంపాదనతో కొనుకున్న హొండా-ఎక్టివా మీదనే వెళ్తుంది.

తనను పెళ్ళి చేసుకోబొయేవాడు తన ఆస్తిని చూసి ఆశపడో తన మొహం మాత్రమే చూసి మొసపోయో చేసుకోకూడదు. తనని, తన మనసుని పూర్తిగా తెలుసుకొని తర్వాత పెళ్ళి చేసుకోవాలి అని సుబ్బలక్ష్మి కోరిక. కానీ తండ్రి కష్టాలు చూడలేక అన్ని వదిలేసి ఈ సారి వచ్చేవాడికి ఓకే చెప్పేయాలి అని ..అలాగే వాడికి నచ్చేలా అవ్వాలి అని నిర్ణయించుకుంది.

దానికోసం తను గత వారంగా భోజనం మానేసి పచ్చి కూరలు ఫలాలు తింటూ రోజూ 10 గంటలు వ్యాయామాలు చేస్తూ చాలా కష్టపడుతోంది. ఈ పెళ్ళికొడుకు ఫొటోని చూసినప్పుడే కొంచెం నచ్చేసాడు. మొన్న మీటింగ్ వల్ల పెళ్ళిచూపులు అబ్బాయి పొద్దున పెడదాము అంటున్నడు అని వామనరావు చెప్తే పని మీద అతనికి ఉన్న శ్రద్ద ఇంకొంచెం ఇష్టాన్ని పెంచింది. ఇప్పుడు అతను వచ్చి ఒక్కసారి నచ్చింది అని చెప్తే తాళి కట్టించేసుకుందాము అని అనుకుంటోంది సుబ్బలక్ష్మి. కానీ మనసులో ఒక మూల మాత్రం తనతో ఒక 2 వారాల పాటు మాట్లాడి తన అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలి అన్న భావం కూడా కలిగింది.

ఏమి చేయాలన్నది ఇంకా అలోచించకముందే పెళ్ళిచూపుల రోజూ రానే వచ్చింది. తెల్లవారు జామున ఆరింటికే అబ్బాయి వస్తాడు అని తెలుసు కబట్టి అంతకి ముందు రోజునే బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంది. వాళ్ళకి పెళ్ళిచూపులు రేపు పొద్దునే అని చెప్తే మీరు పొద్దున 5 కి వస్తే ఇంకో ఫేషియల్ చేస్తాము అన్నారు.
ఇప్పుడు పొద్దునే మూడింటికి నిద్ర లేచి ఎక్సర్ సైజులు చేస్తోంది. టైము పావు తక్కువ ఐదు అవ్వగానే బండి తీసుకొని పార్లర్ కి బయలుదేరింది

మిగితా కధ త్వరలో...

2009-10-23

సుబ్బిగాడు vs సుబ్బలక్ష్మి

కౌసల్యా సుప్రజా! రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దులా! కర్తవ్యం దైవమాహ్నికం...

తెలతెల్లవారుతోంది రాత్రి చూసిన సినిమా ఇంకా గుర్తు వస్తూ ఉంది మన హీరో సుబ్బారావుకి. సుబ్బారావు ముద్దుగా సుబ్బిగాడు ఒక పెద్ద సాఫ్టువేరు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. నెలతిరిగే సరికి అర లక్షజీతం దానితో పాటు అరకిలో బరువు బిల్లులు వస్తాయి. అవి కట్టుకునే సరికి సుబ్బిగాడి ఖాతాలో అణా కూడా మిగలదు. అందుకే సుబ్బిగాడు వయస్సు మూడుపదులు దాటుతున్నా పెళ్ళి మాట ఎత్తలేదు ఇంట్లో. కానీ సుబ్బిగాడి అమ్మ నాన్న మాత్రం గత 3 ఏళ్ళుగా వాడికి పెళ్ళికూతురుని వెతికేపనిలొనే ఉన్నారు.

సుబ్బిగాడు ఏజి 30+ అయినా కనిపించటానికి 25 లాగనే వుంటాడు. ఈ రోజు వాదికి 100వ పెళ్ళిచూపులు ఈ సారన్నా సుబ్బిగాడు ఓకే అనాలి అని వాడి అమ్మనాన్న మొక్కని దేవుడు లేడు ఎక్కని గుడిమెట్లు లేవు. ఈ పెళ్ళిచూపులు ఎలగన్నా తప్పించుకోవాలి అని మన సుబ్బిగాడు చాలా ప్రయత్నాలు చేసాడు కానీ ఏది పనికి రాలేదు పైగా అందులో ఒకటి బెడిసికొట్టి సాయంత్రం ఆరింటికి జరగాల్సిన పెళ్ళిచూపులని పొద్దున ఆరింటికి మారేటట్టు చేసింది. ఇందాక మీరు చదివిన ఆ సుప్రభాతం మన సుబ్బిగాడి అలారం సౌండే..

పొద్దుపొద్దునే ఈ పాడు పెళ్ళిచూపులు ఏంటిరా దేవుడా అంటూ బద్ధకంగా లేచాడు మనసుబ్బిగాడు. లేచి సెల్లులో టైము చూస్తున్నాడు వెంటనే వచ్చింది పల్లెటురులో ఉన్న అమ్మనాన్నలనించి ఫోను

"అరేయ్ బడుద్దాయ్! లేచావా లేదా నిన్న చెప్పింది అంతా గుర్తున్నది కదా మంచిగా గెడ్డం చేసుకో.. పొయిన సారి పెళ్ళి చూపులకి వేసుకున్నావే అలాంటి నవ్వారు గుడ్డలు వేసుకోకుండా" అని ఎదో చెప్పబోయాడు సుబ్బరావు తండ్రి అప్పారావు. కాని దానిని మధ్యలోనే ఆపేస్తూ

"వాటిని జీన్స్ అంటారు మీరు చెప్పే నవ్వారుకి దీనికి చాలా తేడా వుంది అయినా పోయిన సారి నేను వేసుకు వచ్చింది బ్రాండెడ్ జీన్స్ తెలుసా మీకు" అని గట్టిగా అరిచాడు మన సుబ్బిగాడు.

మీకు చెప్పటం మర్చిపొయాను మన సుబ్బిగాడికి వచ్చిన ఆ అరకిలో బిల్లులు ఏవో లోనువి అని పొరబడేరు అవన్ని మన సుబ్బిగాడి బట్టలకీ ఇంకా మిగితా సరంజామా కొనటానికి గీకిన క్రెడిట్ కార్డుల తాలూకా బిల్లులు. అలాగని సుబ్బిగాడు మరీ దుబారా అనుకోకండి ప్రతీ నెలా తన దగ్గర వున్న డజను కార్దులలో ఒక దానిని ఎంచుకొని దాని లిమిట్ వచ్చేదాకానే షాపింగ్ చేస్తాడు.

"ఏదో ఒక దరిద్రంలే ఈ సారన్నా ఆ పిల్ల నచ్చింది అని చెప్పరా నీచేత ఆ మూడు ముళ్ళు వేయించేసి ఇంక మేము ధైర్యంగా వరల్ద్ టూరు కి వెళ్ళచ్చు" అన్నదు అప్పరావు.

తండ్రి కంగారు తన పెళ్ళి మీదా లేదా టూరు మీదా అన్న మీమంసలోనే "సరే" అని చెప్పి ఫోను పెట్టేశాడు.
ఈ సారి ఎలా పెళ్ళిచూపులు చెడగొట్టాలా? అని అలోచిస్తుండగా కాలింగ్ బెల్లు మొగింది. ఈ టైములో ఎవరా? అని చిరాకుగా తలుపు తలుపు తీసాడు. ఎదురుగా నుంచున్న వ్యక్తి తలుపు తేరవగానే "సాబ్ చెత్త డబ్బుల్" అన్నాడు.
పొద్దుపొద్దునే ఈ చెత్త గోల ఏంటి అని గొణుకుంటూ జేబులోంచి ఒక 20 నోటు తీసి అతనికి ఇచ్చి తలుపు వేసేసాడు. ఎంత ఇష్టంలేకున్నా వెళ్ళేది పెళ్ళిచూపులకి కదా. అసలే అలిండియా సోలో అందగాడిని అనుకుంటూ ఒకసారి కొత్తగా ఈమధ్యనే కొన్న నిలువుటద్దం ముందు నిల్చున్నాడు. ఒక సెకను చూసుకున్నడో లేడో మళ్ళీ కాలింగు బెల్లు మోగింది. ఈసారి ఎవడురా? అని చిరాగ్గా తలుపు తెరిచాడు ఎదురుగా మన సుబ్బిగాడి రూముమేట్ బాబిగాడు కనిపించాడు.

బాబి ఒక కాల్ సెంటర్లో పని చేస్తాడు. వాడు రోజూ సురీడు నిద్రపోగానే వెళ్ళి నిద్రలేచే లోపు తిరిగొస్తుంటాడు. పేరుకి ఇద్దరూ ఒకే రూము కానీ ఇద్దరూ కలిసి ఒక 10 నిముషాలు మాట్లాడేది నెలకి ఒకట్రెండు సార్లు మించదు.
ఈ రోజుకి నేను కేవలం మన హీరో సుబ్బిగాడి పరిచయం చేయగలిగాను త్వరలో మీకు సుబ్బలక్ష్మిని పరిచయం చేస్తాను. సమయాభావం వల్ల ఇలాగా కధని ముక్కలు చేసి రాస్తున్నాను

2009-10-22

బ్లాగర్లందరికీ నా మనవి

బ్లాగర్లందరికీ నా ప్రార్ధన నేను ఈ బ్లాగు ప్రపంచంలో కొత్తగా వచ్చాను కాని ఇక్కడ చాల మంది చాల రోజులనించి రాస్తున్నరు. మీరందరూ కూడా నా కింది తపా కొంచెం ఓపిక చేసుకొని చదివి మీకు నచ్చినంత సహాయం ఇచ్చి ఈ కార్యక్రమన్ని గురించి ఒక రెండు ముక్కలు మీ బ్లాగులో రాయంది అని నా సవినయ మనవి.

ఆపరేషన్ సహాయ--మీ సహాయసహకారాల కావలెను

"ఆపరేషన్ సహాయ" అనేది నిర్మాన్ అనే స్వచ్చంధ సేవా సంస్థ వారు వరద బాధితుల కోసం మొదలు పెట్టిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా 100 కుటుంబాలకి ఉపాధి కలిపించాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమము నిర్వహించటానికి మీకు తోచినంత ఆర్ధికసహాయం అందించి బాధితుల జీవితలలో వెలుగు నింపాలి పాఠకులందరికీ మనవి చేసుకుంటున్నాను. మీరు సహయం చేయాలి అనుకుంటే నన్ను సంప్రదించండి లేక పొతే ఈ లంకెలో పేర్కొన్న విధంగా చెయండి
http://www.nirmaan.org/os/floodrelief.html

ఇక వివరాలలోకి వెళ్తే....
మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రలలో వరద చేసిన బీభత్సం. ఈ వరద వల్ల తమ సర్వస్వం కోల్పొయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రభుత్వం సహయం అందచేయటానికి ప్రయత్నిస్తోంది కాని అందరికీ ప్రభుత్వం సహకారం లభించటం కష్టం. మన ప్రభుత్వోద్యోగుల సంగతి మీకు తెలిసిందే పని చేసేవారు ఎంత మందుంతారొ పని చేయని వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. ఈ కారణాలు అన్ని దృష్టిలొ పెట్టుకొని నిర్మాన్ వారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

కర్నూల్ జిల్లాలోని నిడ్జూరు మరియు సింగవరం అనే గ్రామాలు వరద సమయంలో పూర్తిగా నీటమునిగాయి. ఇప్పటికి కూడా వరద తగ్గి పక్షం పైనైనా ఇంకా చాలా మంది జనం తమతమ ఇళ్ళలోకి వెళ్ళలేకున్నారు. ఆ గ్రామాలలో చాలా మంది వ్యవసాయం పాడి మీద బ్రతుకుతారు. ఇప్పుడు వాళ్ళు తమ సర్వస్వం పోగొట్టుకున్నారు. ఇలంటివారందరికి సహాయం అందించటం నిర్మాన్ అభిమతం కాని అందరికి సహయం అందించే ఆర్ధిక స్థొమత లేనందున చందాలు పోగుచేసి కనీసం ఒక 100 కుటుంబాలకైనా బ్రతుకుతెరువు చూపించాలి అని ప్రయత్నిస్తున్నది.

ఇప్పుడు మీరు ఇచ్చె చందాలతో వారికి కుట్టు మిషన్లు, ఆవులు గేదేలు వంటివి ఇచ్చి వారికి ఒక బ్రతుకుతెరువు చూపించటం జరుగుతుంది. కావునా మీరు అందరూ విసాల హృదయంతో ఈ బృహత్కార్యాన్ని విజయవంతం చేయ ప్రార్ధన.

మీకు చెప్పటం మరిచాను నేను నిర్మాన్ లో ఒక సభ్యుడిని. మీకు ఏమన్న సందేహాలు వున్న సమాచారం కావాలి అన్నా నన్ను అడగచ్చు.

2009-10-17

దీపావళి శుభాకాంక్షలు

పాఠకులందరూ ఈ దీపావళి చాలా సరదాగా మరియు శ్రద్ధ గా జరుపుకోవాలి అని ఆశిస్తూ మీ నేస్తం:)

2009-10-12

నా అనుభవం -- వరద బాధితుల సహయం

చాలా రోజులయింది మీతో మాట్లాడి పనివత్తిడి వల్ల బ్లాగులో రాయటం కుదరట్లేదు. ఈ రోజు ఎలాగన్నా సరే మిమ్మల్ని పలకరించాలి అని గట్టిగా అనుకున్నాను.

ఈ మధ్య కాలంలో మీకు చెప్పగలిగిన సంఘటనలు చాలనే చోటు చేసుకున్నాయి కానీ సమయాభావం వల్ల అవన్ని రాయలేకున్నాను. ఐతే వాటన్నిటిలోకి ముఖ్యమైన సంఘటన చెప్తాను వినండి. నేను గత శనివారం కర్నూల్ దగ్గర వున్న పంచలింగాల అనె గ్రామానికి వరద బాధితులకి సహయం చేద్దాము అని వెళ్ళాను. మా సంస్థ వారే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మేము మొత్తం 30 మంది సహోద్యోగులం కలిసి వారికి పంచే బాధ్యత తీసుకున్నాము. మా సంస్థ లొ పని చెసె 150 మంది దాక ఉద్యోగులు ఒక రోజు జీతం ఈ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. అలగే మా సంస్థాధినేత కూడా సంస్థ తరుఫున ఉద్యొగులు ఇచ్చిన దానికి రెండింతలు చందాగా ఇచ్చారు.

ఈ డబ్బులతో మేము ఒక వెయ్యి కుటుంబాలకి నిత్యవసర సమాన్లు ఇద్దాము అని తీసుకెళ్ళము. గతంలో ఎవరికి ఇలంతి కార్యక్రమము చేసిన అనుభవం లేకపోవటంతో మేము ఒక వ్యుహం రూపొందించటానికి వివిధ వ్యక్తుల మరియు సంస్థల ల సలహాలు సూచనలు విన్న పిమ్మట క్రింది వ్యుహం ఆచరిద్దాము అని అనుకున్నాము.
ఆ వ్యుహం ఏంటంటే అక్కడ వుండే కొంతమంది గ్రామస్తుల సహకారంతో అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి మా సంస్థ ముద్ర వున్న చీటి ఒకటి ఇచ్చి ఒక బహిరంగ ప్రదేశానికి ఒక గంత తర్వాత రమ్మని చెప్పాము. అక్కద చీటి ఇచ్చన వారికి మేము ముందుగానే తయారు చేసుకున్న నిత్యావసరసమాన్లను ఇచ్చాము. ఈ రకం గా పంపిణీ చేయటం వల్ల మాకు చాలా గొడవ తగ్గింది మరియు సాధ్యమైనన్ని ఏక్కువ కుటుంబాలకు సహాయం చేసామన్న తృప్తి మాకు మిగిలింది. అక్కడ ఊరిలో వారి పరిస్థితి తలుచుకుంటె చాలా భాదగా అనిపిస్తుంది. ఆ ఊరు వరదల్లో పూర్తిగా మునిగిపొయిన వాటిలో ఒకటి. అందరిళ్ళలోనూ కనీసం ఒక అడుగులోతు బురద. కొందరి ఇళ్ళలోనైతే మూడునాలుగడుగుల లోతు బురద. భరించలేనంత దుర్వాసన. అందులోనే వాళ్ళు తమతమ ఇల్లు ని శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వమ్నించి ఎటువంటి సహాయం అందలేదు అని చెప్తున్నారు. అక్కడ విద్యుత్ ఇంకా రావట్లెదు. చాలా ఇళ్ళు వరదలో పాక్షికంగా దెబ్బతిన్నాయి. అక్కడి వారికి కొన్ని సంస్థలు సహాయానికి వచ్చినా వాళ్ళు ఒక కూడలిలో బండి ఆపి పంపిణీ చేయటంవల్ల అందరికి చేరటం లేదు.

ఇంకా చాలా విషయాలే ఉన్నయి కానీ సమయాభావం చేత ముగిస్తున్నాను. చివరిగా మీకు నా విన్నపం మీరు కూడా వరద భాదితులకి చేతనైనంత సహాయం చేయండి. మీరె ఈ సహయం ఏ రూపంలోనన్నా చేయచ్చు. మీకు చేయలి అని నున్నా ఎవరికి ఇవ్వాలి అని తెలియక పొతే నాకు చెప్పండి నేను మీరుండే ప్రదేశన్ని బట్టి ఎలా సహాయం చేయగలరో వివరాలు సేకరించి మీకు అందిస్తాను. లేదు మీరు మీ విరాళమేదన్నా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇద్దాము అనుకుంటే నాకు తెలిసిన ఒక సంస్థ వుంది దాని పెరు "నిర్మాన్" మీరు మీ విరాళం దానికివచ్చు. నిర్మాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోటానికి ఈ లంకెను వీక్షించండి http://www.nirmaan.org/

2009-10-03

నేను తీసిన చిత్రపటములు



తులసి పువ్వులపై తూనీగ







ఓం నమః శివాయ...మా ఊరి దేవాలయం దగ్గర తీసిన చిత్రం



కష్టసుఖాల కలయికే ఈ జీవితం. నీ జీవితం లో ఎన్నో లోటుపాటులు ఉంటాయి అని గుర్తు చేసే చిత్రం

గడ్డి పువ్వు

గాంధి జయంతి శుభాకాంక్షలు


(మొన్ననే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి దగ్గర తీసిన చిత్రపటము)

రఘుపతి రాఘవ రాజారాం


పతీత పావన సీతారాం


ఈశ్వర అల్లా తేరేనాం


సబ్ కో సన్మతిదే భగవాన్

2009-09-24

విజయదశమి శుభాకాంక్షలు

నా హిందూ సోదరులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగ దసరా గురించి రెండు ముక్కలు.


విజయదశమికి గల మరిన్ని పేర్లు

  • దసరా
  • దుర్గ నవరాత్రి
  • దుర్గోత్సవం

విజయదశమి ఎప్పుడు చేస్తారు


తెలుగు నెలల ప్రకారం ఆశ్వియుజ మాసము శుక్లపక్షములో దసరా నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులలో ముఖ్యమైనవి 8,9 మరియు 10 రోజులు. ఈ రోజులని కొన్ని చోట్ల దుర్గాష్టమి, నవరాత్రి మరియు విజయదశమి/దసరా అందురు

విజయదశమి ప్రత్యేకత ఏమిటి?

దసరా భారత్ మరియు నేపాల్ లో లొ హిందువులు జరుపుకొను పండుగలలో ముఖ్యమైనది. ఈ పండుగ గురించి చాలా కధలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో కొన్ని మీ కోసం:


1) భారతదేశంలో వ్యవసాయం మొదలుపెట్టు సమయం ఇది కాబట్టి తమతమ పైరుని రక్షించమని మరియు భూమికి మంచి సారం ఇచ్చి దిగుబడి పెంచమని ఈ పండుగ జరుపుకుంటారు.


2) రామరావణుల యుద్ధము 10 రోజులు జరిగింది. ఆ యుద్ధము దసరా పండుగ మొదటి రోజున మొదలయి ఆఖరి రోజుకి రావణుని అంతంతో ముగిసింది. రాముడు రావణుడితో యుద్దసమయమున చండి యగము చేయగా ఆ యాగమునకు మెచ్చి దుర్గమ్మ రావణుని చంపు మార్గము సూచించింది. అట్లా రావణుడిని చంపి రాముడు తన వానర సేనతో అయొధ్యకి సీతసమేతుడై దసరా రోజున వచ్చాడు అని ఒక కధ


3) మహిశాసురుడు అనే రాక్షసుడు దున్నపొతు రూపంలో వుండేవాదు అతనికి ఉన్న బలముతో పరాక్రమముతో దేవతలను మానవులను అందరిని ఓడించాడు. బ్రహ్మవిష్ణుమహేస్వరులు కూడా అతని ముందు తలవంచక తప్పలేదు. అప్పుడు త్రిముర్తుల శక్తితో ఒక అందమైన 10 చేతులు కలిగిన శక్తిని తయారు చేసారు. ఆ శక్తికి సకల దేవతలు ఒక్కొక శక్తిని ఇచ్చి బలవంతురాలుగా చేసారు. ఆ శక్తి దుర్గమ్మగా అవతారము ఎత్తి సింహం వాహనంగా చేసుకొని మహిశాసురునితో భీకర పోరు చేసెను. ఆ సమరం 10 రోజులు సాగి చివరికి విజయదశమి రొజున ముగిసింది. దుర్గమ్మ గెలుపుని గుర్తుచేసుకుంటూ చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు.


4) పూర్వము దక్షుడను ఒక ప్రజాపతికి ఉమ అను కూతురు కలదు. ఆమె పరమశివుడిని తన భర్తగా తలచి నిష్ఠగా పూజలు చేస్తు వుండెను. ఆ పుజలకి మెచ్చి పరమశివుడు ఆమెను వివాహము చేసుకొనెను. అది దక్షునికి ఇష్టం లేని వివాహము. కొన్ని రోజుల తర్వాత దక్షుడు యగ్నం చేస్తూ అందరిని పిలిచి పరమశివునిమాత్రము పిలవకపోయెను. అంతట ఆగ్రహించిన ఉమదేవి భర్తకు జరిగిన అవమానము తాళలేక యగ్నగుండములో ప్రాణత్యాగము చేసెను. ఉమదేవి ఆత్మహత్య గురించి తెలుసు కున్న శివుడు ఆగ్రహముతొ తన జెటాజుటమునించి ఒక పాయతో వీరభధ్రుడిని సృష్తించెను. శివుడు ఉమదేవి శరీరమునిగైకొని భాదతో ప్రపంచవిహారము చేయసాగెను. అంతట విష్ణువు తన చక్రముతో ఉమదేవి శరీరముని చిన్నాభిన్నము చేసెను. ఆ ముక్కలు పడిన చోట్లనె మనము ఇప్పుడు శక్తి పీటాలుగా పూజిస్తున్నాము. ఆ తర్వాత కొంత కాలానికి ఉమదేవి పార్వతిగా జన్మించి పరమశివుని పెళ్ళాడెను. ఆ పిమ్మట విషునువు కోరిక మేర శివుదు దక్షుడిని క్షమించెను. పార్వతిదేవి ప్రతి సంవత్సరం దసరానాదు తన తండ్రైన హిమలయుని వద్దకు పిల్లథొ ఇష్టసఖులతో కలిసి వస్తుంది కావున ఈ ఉత్సవం జరుపుకొనెదరు.

విజయదశమి ఎలా జరుపుకుంటారు?


విజయదశమి పండుగ తొమ్మిది రోజులు జరుగును. ఈ రోజులలో కొన్నీ ప్రదేశాలలొ గుడిలో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు. ముఖ్యంగా విజయవాడ లోని దుర్గమ్మ అలంకారములు చూచుటకు రాష్ట్రమంతటి ప్రజలు వస్తారు. కోందరు భవాని మాల వెసుకొని విజయదసమి నాడు ఇరుముడి దించి మాలని ముగిస్తారు.


సామాన్యుల విషయానికి వస్తే దసరా రోజున పొద్దునే లేచి తలస్నానం చేసి దుర్గమ్మకి పూజ చేసి పిండివంటలతో కూడిన నైవెద్యం అమ్మవారికి పెడతారు. కొన్ని చోట్ల రాత్రికి గుడిలో సెమీపూజ జరుగుతుంది ఆ పుజా సమయములో జమ్మి చెట్టుకి ఈ పద్యము రాసిన చీటి పెట్టి ఏదన్నా కోరుకుంటే తప్పక జరుగుతుంది అని నమ్మకము. ఆ పద్యము:

"శమీ శమైతే పాపం శమీ శత్రువినాశనం

అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం"

2009-09-23

జాయ్ ఆఫ్ గివింగ్ వారోత్సవాలు

అసలు ఈ జాయ్ ఆఫ్ గివింగ్ వారోత్సవాలు అంతే ఏమిటి?

దీని గురించి మనం తెలుసుకోవతనికి ముందు మనము కొన్ని నిజాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే.....

1) మన దేశంలో ఉన్న స్వచ్ఛంధ సేవా సంస్థలు 12 లక్షల పైచిలుకు.(ఇది ప్రభుత్వ లెక్క ఇంకా లెక్కలోనికి రానివి చాలా ఉండవచ్చును)
2) వాటిలో చాలా వాటికి సమాజ సేవ చేయటానికి ఎదుర్కునే ముఖ్యమైన సమస్యలు రెండు

  • నిధులు
  • మానవ వనరులు

పై విషయాలు తెలుసుకున్నాక మన మనసులో మెదిలే ప్రశ్న ఈ సమస్యలని ఆ సంస్థలు ఎలా ఎదుర్కుంటున్నాయి అని?


ఇలాంటి ప్రశ్నలకి పూర్తి సమాధానం కాకపొయినా తమ వంతు సమాధానంగా "గివ్ ఇండియా" వారు ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాలలో చాలా మంది ప్రముఖులు పాలుపంచుకుంటున్నారు. ఆ ప్రముఖులలొ కొంత మంది సచిన్, ద్రావిద్,నందన్ నీలకని, నారాయణ మూర్తి, అజీం ప్రేమజీ ఇలాగ చాలామంది ఉన్నారు.


అసలు ఈ వారోత్సవాలలో ఏమి చేస్తారు?

ఈ వారోత్సవాలలో స్వచ్ఛంధ సంస్థలు తమకు కావాల్సిన వనరుల కొరకు, తమ సంస్థ ఉనికిని చాటుకొనుటకు మరియు తమ సంస్థ ముఖ్యౌద్దేశములు సాధించటానికి కృషి చేస్తాయి

సాధారణ ప్రజలు చేయగలిగినది ఏమిటి?

ఈ కార్యక్రమముని విజయవంతము చేయుటలో ప్రజల సహకారము ఎంతో అవసరము. మీరు చేయవలసిందల్లా మీకు తోచినంత అది చిన్నదైన పెద్దదైన ఈ వారంలో మీకు తెలిసిన స్వచ్ఛందసేవాసంస్థలకు ఇవ్వండి. మీరు ఈ వారంలోనే ఇవ్వాలి అని నియమము ఏమి లేదు. ఈ వారము కేవలము ప్రజలలో సేవాతత్ప్రత పెంచటానికి మరియు ప్రజలని స్వచ్ఛందసేవా సంస్థలకు దగ్గర చేయటానికి ఉపయొగపదుతుంది అని వారి ఉద్దేశము.

ఈ కార్యక్రమము గురించి మరిన్ని వివరాలు నేను ఎలా తెలుసుకోవచ్చును?
దీని గురించి మరిన్ని వివరముల కొరకు దయచేసి ఈ లంకెను(అదేనండి లింకు) చూడగలరు http://www.joyofgivingweek.org/.


అన్ని చెప్పి అసలు ఈ వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయో రాయటం మర్చిపొయాను చూసారా నా మతిమరుపు ఈ వారోత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరుకు జరుగుతాయి

2009-09-22

ఇది మీకు తెలుసా?

  1. ఎప్పుడైనా చిన్న చిన్న కాలిన గాయాలు ఐతే "కోల్గేట్" రాసుకుంటే సెప్టిక్ కాకుండా తగ్గిపోతుంది
  2. మొటిమలు తగ్గటానికి వాటి మీద తేనె రాసి "బాండైడ్" వేస్తే తగ్గిపోతాయి

2009-09-21

నా కవితలు--3

ఒక ప్రేమికుడు తన ప్రియురాలు(ఇంకా తను ప్రేమను ఒప్పుకోలేదు)కి రాసిన ప్రేమ కవిత (:))

చెలీ నీ అందెల సడి రేపెను నాలో అలజడి
సఖి నీ చుపుల వాడి రేపెను నాలో కోరికల వేడి
ప్రియా నీ మాటల గారడి రేపెను నాలో ఏదో హడావిడి
ప్రియతమా నీ చెప్పుల జోడి రేపెను నాలో తెలియని అలికిడి

శిరిష గారి వ్యాఖ్యల తరవాత మార్చబడిన కవిత


చెలీ నీ అందెల సడి రేపెను నాలో అలజడి
సఖి నీ చూపుల వాడి లేపెను నాలోని కోరికల వేడి
ప్రియా నీ మాటల గారడి చేసెను నాలో ఏదో హడావిడి
ప్రియతమా నీ చెప్పుల జోడి నింపెను నాలో తెలియని అలికిడి

రంజాన్ శుభాకాంక్షలు

నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ సమయంలో రంజాన్ గురించి రెండు ముక్కలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను.

అసలు రంజాన్ అంటే ఏంటి?

రంజాన్ మహ్మదీయ కాలెండర్లోని తొమ్మిదవ నెలను రామదాన్ లేక పొతే రంజాన్ అంటారు.
ఆ నెలకు యెందుకు అంత ప్రత్యేకత?

ఈ నెలలోనే మహ్మదీయ పవిత్ర గ్రంధమైన "ఖురాన్" మొదటి పేజీలు విడుదల అయ్యాయి అని వారి నమ్మకం.

రంజాన్ ప్రార్ధనలు ప్రత్యేకత ఏమిటి?

రంజాన్ సమయంలో ముస్లిం సోదరులు వారు చేసిన తప్పులను క్షమించమని భవిష్యత్తులో తప్పులు కాకుండా తమకు జ్ఞానం ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటారు.

ఈ నెలలో వారు పాటించే నియమాలు ఏమిటి?

ఈ నెలలో వారు కటిక ఉపవాసం ఉందురు. ఈ నెలలో వారు ఉదయం మొత్తం వారి ఉమ్ముతో సహా ఏమి తినరు. సాయంత్రం వేళలలో ఏదికావాలి అంటే అది తినవచ్చును. ఈ ఉపవాస దీక్ష వల్ల వారిలో భగవంతుని మీద భక్తి పెరుగుతుంది మరియు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటానికి ఊపకరిస్తుంది అని వారి నమ్మకము.
ఇఫ్తర్ విందు అనగానేమి?

ఇఫ్తర్ విందు అనగా సాయంసమయంలో ఉపవాస దీక్ష విరమించు వేళ చేసే విందు

2009-09-17

నేను తీసిన చిత్రపటాలు


జలపాతం--ఎత్తిపోతల




గులాబి పువ్వు






పువ్వు పైన తేనెటిగ




పువ్వు పైన సీతాకొకచిలుక

మీకు ఈ విషయం తెలుసా!!!!

ఇప్పుడు అమ్ముతున్న స్వైన్‌ఫ్లు మాస్కులు కన్నా మీరు ఒక రుమాలు తీసుకొని దాని మీద డెటాల్ గానీ నీలగిరి నూనె కానీ వేసుకొని ముక్కుకి అడ్డు పెట్టుకుంటే స్వైన్‌ఫ్లు వచ్చే అవకశాలు తక్కువ!!!

నేను రాసిన కవిత-2

వాన కవిత
చిరుగాలులలో సవ్వడి చెస్తూ చేరెను చినుకు
చినుకు జడతో మొదలయ్యే నాలో వొణుకు
ఎందుకో మదిలో రేగెను తెలియని బెణుకు
కనిపించలేదే ఆకశంలో తారల మిణుకు మిణుకు

2009-09-16

నేను రాసిన కవిత-1

చిరునవ్వుల చిరుజల్లులో నన్ను ముంచావు
చిరుమువ్వల జడితో అలజడిని రేపావు
ముద్దు ముద్దు మాటలతో మైమరిపించావు
కడకి కన్నీటి సౌధంలో నన్ను విడిచావు